ముహూర్తం ఫిక్స్‌.. లోకేష్‌కు కీల‌క ప‌ద‌వి ..!

తెలుగు త‌మ్ముళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కీల‌క ఘ‌ట్టానికి మ‌హానాడు వేదిక కానుంది.;

Update: 2025-05-26 09:39 GMT

తెలుగు త‌మ్ముళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కీల‌క ఘ‌ట్టానికి మ‌హానాడు వేదిక కానుంది. పార్టీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌కు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇచ్చేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. పార్టీ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు.. టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌(ఇది అధ్య‌క్షుడి త‌ర్వాత‌.. అధ్య‌క్షుడిస్థానం) ప‌ద‌వికి నారా లోకేష్‌ను అంత‌ర్గ‌తంగా ఎంపికచేశారు. దీనిని అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి.

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎంపిక చేయాలంటే.. పొలిట్ బ్యూరోలో 60 శాతం మంది అనుకూలంగా అంగీక రించాలి. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన పొలిట్ బ్యూరో స‌మావేశంలోనే నారా లోకేష్‌కు అనుకూలంగా 100 శాతం నాయ‌కులు అంగీకారం తెలిపారు. ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడే వ‌ద్ద‌ని చెప్పినా.. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌ను వారు సైతం అంగీక‌రించారు. దీంతో మ‌హానాడు వేదిక‌గా.. నారా లోకేష్‌కు.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ప‌ద‌విని అప్ప‌గించనున్న‌ట్టు స‌మాచారం.

మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజుల పాటు జ‌రిగే మ‌హానాడులో రెండో రోజు నారా లోకేష్‌కు ఈ ప‌ద‌విని కేటాయిస్తూ.. పార్టీ అధ్య‌క్షుడి హోదాలో నారా చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఇక‌, ఈ ప‌ద‌విని ఇవ్వ‌డం ద్వారా పార్టీలో నేరుగా నారా లోకేష్ కు త‌దుప‌రి అధ్య‌క్ష పీఠం అందుకునే అవ‌కాశం ఉంటుంది. వాస్త‌వానికి గ‌త మ‌హానాడులోనే ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. అయితే.. సీనియ‌ర్లు కొంద‌రు అడ్డు ప‌డ‌డం, ఎన్నిక‌ల‌కు ముందు నిర్ణ‌యాలుస‌రికాద‌ని భావించ‌డంతో వాయిదా వేశారు.

ఈ ద‌ఫా సీనియ‌ర్ల నుంచి కూడా స‌హ‌కారం రావ‌డం.. యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌లిసి రావ‌డంతో పాటు.. చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేల్లోనూ నాయ‌కులు అనుకూలంగా నారా లోకేష్‌కే ఓటేయ‌డం వంటివి క‌లిసి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేష్.. అన‌ధికారికంగానే పార్టీ కార్య‌క్ర‌మాల్లో నెంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కానీ, ఇప్పుడు అధికారికంగా ఆయ‌న నెంబ‌ర్ 2 అయ్యే అవ‌కాశం వ‌స్తుంది. త‌ద్వారా పార్టీపై పూర్తి ఆధిప‌త్యం.. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స్వేచ్ఛ వంటివి ఆయ‌న‌కు ద‌క్కుతాయ‌ని అంటున్నారు. ఇక‌, ఈ ప‌ద‌విని ఆయ‌న చేపడితే.. టీడీపీలో అతి పిన్న వ‌య‌సులో ఈ ప‌ద‌విని ద‌క్కించుకున్న తొలి నాయ‌కుడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు.

Tags:    

Similar News