పసి రాజా...నిక్కర్ మంత్రి...అంతేనా ?

తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే ఏడున్నర పదుల చంద్రబాబు పొలిటికల్ గా రిటైర్ అయితే అందుకోవాల్సింది లోకేష్ అన్నది పార్టీలో మొత్తానికి తెలుసు.;

Update: 2025-03-30 14:30 GMT

టీడీపీకి ఆయన భావి నాయకుడు. చంద్రబాబు తరువాత అంతటి వారు. ఒక విధంగా చెప్పాలీ అంటే తెలుగుదేశం ఇపుడు ఆయన పర్యవేక్షణలోనే ఎక్కువగా ఉంది అని అంటారు. ఇక చంద్రబాబు కూడా ఈ అయిదేళ్ళ కాలాన్ని తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటారు అని కూడా ప్రచారం సాగుతోంది.

ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి బాబు తరువాత లోకేష్ అన్నది వాస్తవం. ఇక లోకేష్ కి టీడీపీలో పోటీ ఎవరూ లేరు. ఆయనతోనే పార్టీ ఉండాలి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పోయిన ఫార్టీ పెర్సెంట్ ఓటు బ్యాంక్ ఎపుడూ కచ్చితంగా ఉంటుంది. ఆ మీదట పాజిటివ్ వేవ్స్ ని క్రియేట్ చేసుకుంటే అధికారం దఖలు పడుతుంది.

తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే ఏడున్నర పదుల చంద్రబాబు పొలిటికల్ గా రిటైర్ అయితే అందుకోవాల్సింది లోకేష్ అన్నది పార్టీలో మొత్తానికి తెలుసు. ఇక తెలుగుదేశం పార్టీలో యువతకు జూనియర్ లీడర్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. వీరంతా రేపటి రోజున లోకేష్ కి అండగా ఉంటారు అన్నది వేరేగా చెప్పాల్సింది లేదు.

ఈ క్రమంలో లోకేష్ ని గతంలో పప్పు అని ప్రత్యర్థి పార్టీలు సెటైర్లు వేసి ర్యాగింగ్ చేసినా ఆయన బాగానే మెరుగు పడ్డారనే అంటారు. ఆయన 2017 నుంచి 2019 దాకా మంత్రిగా పనిచేసినపుడు సోషల్ మీడియాలో ఆయన మీద ఎక్కువగా ట్రోల్స్ వచ్చేవి. ఇపుడు మాత్రం లోకేష్ బాగానే మాట్లాడుతున్నారు.

ఆయన మాటల వెనక పంచులు కూడా బాగా పేలుతున్నాయి. అవి వైసీపీని గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. చిత్రమేంటి అంటే వైసీపీని అవి ఎంతగా మండిస్తున్నా లోకేష్ ని మాత్రం ఒకనాటి పప్పుగా చూడలేకపోతున్నాయి. ఆయన్ని పట్టుకుని అదే రకమైన ర్యాగింగ్ అయితే చేయలేకపోతున్నాయి.

అదే సమయంలో లోకేష్ తమకు సమవుజ్జీ అని చెప్పలేక ఒప్పుకోలేక సతమతమవుతున్నాయి. నిజానికి పార్టీలో లోకేష్ ప్రాబల్యం సీనియర్లకే కొంత ఇబ్బందిగా ఉందని అంటున్నారు. వారిని పక్కన పెట్టి జూనియర్లకు పెద్ద పీట వేయడం అంతగా నచ్చడం లేదు అని అంటున్నారు.

ఇక మిత్ర పక్షాలు సైతం చంద్రబాబుతోనే మా పొత్తులు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. బాబు పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలని పదే పదే కోరడం వెనక కూడా ఈ తరహా ఆలోచనలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. బాబుతో అయితే కలసి పనిచేయడానికి అభ్యంతరం ఉండదు కానీ లోకేష్ అయితే లెక్కలు మారుతాయనే అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ప్రత్యర్ధి వైసీపీ కూడా లోకేష్ దూకుడుని ఆయన ప్రాముఖ్యతను తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు. అందుకే ఆయనకు నిక్కర్ మంత్రి అని నామధేయం పెట్టి ఆ విధంగా ర్యాగింగ్ చేస్తోంది. అంటే ఆయనకు ఏమీ తెలియదు అన్నదే ఆ పేరు పెట్టడం వెనక ఉన్న భావన అన్న మాట.

కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ రెండు సార్లు మంత్రిగా ఉన్న లోకేష్ నిక్కర్ మంత్రి ఎలా అవుతారు అన్నది మాత్రం అర్థం కాదని అంటున్నారు. కానీ వైసీపీ నుంచి అలాంటి పిలుపులే వస్తున్నాయని అంటున్నారు. ఇక తాజాగా లోకేష్ ని పూర్తిగా పసివాడి కిందకే జమ కట్టేశారు.

లోకేష్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ రెడ్ బుక్ అంటే కొందరికి గుండె పోటు వస్తోందని వ్యాఖ్యానించారు. అర్ధమైందా రాజా అని ఆయన వైసీపీ నేతల మీద కామెంట్స్ చేశారు. దాని మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ ని పసి రాజా అని సంబోధించారు. లోకేష్ ని రాజకీయంగా ఇంకా పసివాడి కిందనే వైసీపీ చూస్తోంది అన్నది పసి రాజా అన్న సెటైర్ ద్వారా అర్ధం అవుతోంది అని అంటున్నారు.

లోకేష్ దూకుడు ఎంత చేస్తున్నా స్పీడ్ ఎంత పెంచుతున్నా అన్నీ తండ్రి చాటు బిడ్డగానే సాగిపోతున్నాయని అంటున్నారు. వెనక కొండంత చంద్రబాబు ఉండబట్టే అన్నదే అంతా అంటున్నారు. అంటే నిజంగా లోకేష్ శ్రమ పరిశ్రమ అన్నవి వెలుగులోకి రావాలన్నా కేరాఫ్ బాబు అన్న నీడతో కష్టమే అని అంటున్నారు.

దాంతోనే లోకేష్ స్వపక్షంలోనూ విపక్షంలోనూ పసివానిగానే మిగిలిపోతున్నారా అన్న చర్చ వస్తోంది. మరి లోకేష్ ఎలా ఎలివేట్ అవుతారు అంటే పూర్తిగా బాబు నీడ నుంచి బయటకు వచ్చినపుడే అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో పగ్గాలు లోకేష్ సొంతమై ఆయన ఇదే తీరున దూకుడు చేసేంతవరకూ ఆయన పసిరాజాయే అన్నది వైసీపీ సహా అంతా ఫిక్స్ అయిపోతున్నారా అంటే సీన్ చూస్తే అలాగే ఉంది మరి.

Tags:    

Similar News