ఎంత ఎదిగిపోతున్నావయ్యా !

నారా లోకేష్ రాజకీయానికి అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. అనుకూలతల గురించి ముందు చెప్పుకుంటే తండ్రి చంద్రబాబు కొండంత అండగా ఉండడం.;

Update: 2025-08-06 03:30 GMT

నారా లోకేష్ రాజకీయానికి అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. అనుకూలతల గురించి ముందు చెప్పుకుంటే తండ్రి చంద్రబాబు కొండంత అండగా ఉండడం. బాబు చల్లని చూపు పడిన వారు ఎందరో పెద్ద నాయకులు అయ్యారు. ముఖ్యమంత్రుల స్థాయికి కూడా చేరుకున్నరు. బాబు అంటే ఒక రాజకీయ శిక్షణాలయం అని చెబుతారు. మరి ఆయన కుమారుడిగా లోకేష్ కి అందలాలు అందడం పెద్ద విషయం కానే కాదు, అదే లోకేష్ కి అతి పెద్ద అనుకూలత అయితే ప్రతికూలతలు చాలా ఉన్నాయి. అదే చంద్రబాబు ఘనమైన రాజకీయ వారసత్వాన్ని మోయడం. అది చాలా కష్టతరమైన క్లిష్టతరమైన విషయం. దేశం మొత్తం వెతికి చూసినా బాబు లాంటి రాజకీయ నాయకులు ఉంటారా అన్నది ఒక సందేహం. ఆయన వన్ అండ్ ఓన్లీ అని చెప్పినా అతిశాయోక్తి కానే కాదు. అటువంటి చంద్రబాబు తనయుడుగా లోకేష్ మీద ఆయన ఇమేజ్ నీడలో ఎదగడమే అతి పెద్ద చాలెంజ్.

మెల్లగా మొదలెట్టి :

అయితే లోకేష్ రాజకీయ ప్రస్థానం చూస్తే నెమ్మదిగా మొదలైంది. తెర చాటు నుంచి తెర ముందుకు వచ్చినా ఆయన మెల్లగానే అడుగులు వేశారు. ఇక 2017లో తొలిసారి మంత్రి అయినపుడు ఆయన బాబు కుమారుడిగానే ఆ పదవిని అందుకున్నారు తప్ప స్వీయ ప్రతిభతో కాదని విమర్శలు వచ్చాయి. ఇక 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంగళగిరి నుంచి ఓటమి పాలు అయ్యారు. అయితే అదే ఓటమిని తన విజయానికి సోపానంగా మార్చుకున్నారు. ఇక విపక్షంలోనికి వచ్చిన అయిదేళ్ళ కాలాన్ని కూడా లోకేష్ బాగానే సద్వినియోగం చేసుకున్నారు. చివరి రెండేళ్ళు పాదయాత్ర పేరుతో ఆయన చేసిన రాజకీయ దూకుడు కానీ రెడ్ బుక్ తో క్యాడర్ కి కల్పించిన మనో ధైర్యం కానీ టీడీపీ విజయానికి బాటలు వేశాయి అని చెప్పాలి.

ప్రభుత్వంలో పార్టీలో :

ఇక 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో లోకేష్ పాత్ర పెరుగుతూ వచ్చింది. పార్టీపైన దాదాపుగా లోకేష్ పట్టు సాధించారు అని చెప్పాలి. అంతే కాదు కార్యకర్తలతో నేరుగా భేటీలు వేయడం ద్వారా వారికి పార్టీ తరఫున గట్టి మద్దతు ఇవ్వడం వంటివి ఆయనను మరింత దగ్గర చేశాయి. అలాగే సీనియర్లను గౌరవిస్తూనే జూనియర్లతో తనకంటూ ఒక టీఎం ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా భావి నాయకుడిగా లోకేష్ బాగానే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఇక ప్రభుత్వంలో కూడా కీలకంగా మారారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశానికి ముందు లోకేష్ మంత్రులతో సమావేశం నిర్వహించారు అంటే ప్రభుత్వంలో ఆయన స్థాయి ఏమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సిందే.

మోడీ దగ్గర సైతం :

అదే విధంగా దేశాన్ని ఏలే బలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెప్పు పొందేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు ఆయన ప్రధాని మోడీని కలుసుకున్నారు. తాజా భేటీలో ఆయన ఏపీకి సంబంధించిన అంశాలు అన్నీ పంచుకున్నారు. ఏపీకి భారీ సాయం చేయమని కోరారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రధానికి వివరించారు. ఆ విధంగా కేంద్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దలతో మంచి రిలేషన్స్ పెంపొందించుకుంటూ లోకేష్ తాను స్వయం ప్రకాశంతోన రాణిస్తున్న నాయకుడిగా చాటుకుంటున్నారు. తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ చంద్రబాబు ఢిల్లీ యాత్రల బరువుని తన భుజాన లోకేష్ వేసుకున్నట్లుగానే కనిపిస్తోంది.

ఇక ప్రభుత్వంలో చంద్రబాబు తరువాత తాను కీలకం అన్న సంకేతాలను ఆయన బలంగా పంపిస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే లోకేష్ రాజకీయ ఎదుగుదల చాలా వేగంగానే సాగుతోంది అనిపిస్తోంది. ఆయన ప్రత్యర్ధులు కానీ ఇంటా బయటా ఉన్న సమ వయస్కులైన నాయకులు కానీ అందుకోలేనంత స్పీడ్ తోనే లోకేష్ సాగుతున్నారు. ఇదంతా చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే సాగుతోంది అని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ ఉన్నత అందలాలు అందుకునేందుకు సరిపడా సామర్ధ్యాన్ని మాత్రం బాగానే సంపాదిస్తున్నారు. అయితే కలసి వచ్చే కాలం ఆయనను సరైన పొజిషన్ లో కూర్చోబెడుతుంది అన్న నమ్మకంతో ఆయన అభిమానులు అనుచరులు ఉన్నారు.

Tags:    

Similar News