బలమైన ముద్ర వేస్తున్న లోకేష్
చంద్రబాబును చూస్తే ఒక బలమైన ముద్ర కనిపిస్తుంది. ఆయన విజనరీ అంటారు. అంతే కాదు సైబరాబాద్ రూపకర్తగా నిర్మాతగా బాబుకు ఎనలేని పేరు ఉంది.;
చంద్రబాబును చూస్తే ఒక బలమైన ముద్ర కనిపిస్తుంది. ఆయన విజనరీ అంటారు. అంతే కాదు సైబరాబాద్ రూపకర్తగా నిర్మాతగా బాబుకు ఎనలేని పేరు ఉంది. అలాగే ఐటీ సృష్టికర్తగా హైదరాబాద్ లో ఐటీ వైభవానికి ముఖ్య కారకుడిగా చెప్పుకుంటారు.
అలాగే వైఎస్సార్ అంటే సంక్షేమానికి కేరాఫ్ గా ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. ఇలా నాయకులు ఎవరైనా తమదైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటేనే పాలిటిక్స్ లో దీర్ఘకాలం మనగలరు. ఇపుడు లోకేష్ కూడా తన తండ్రి బాటలో నడుస్తున్నారు. ఆయనకు బ్రహ్మాండమైన శాఖలు దక్కాయి. వాటితోనే తన విజన్ ఏంటో చూపించాలని లోకేష్ తాపత్రయపడుతున్నారు.
లోకేష్ చేతిలో ఐటీ ఎలక్ట్రానికిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మానవ వనరులు, భారీ పరిశ్రమలు వంటి శాఖలు ఉన్నాయి. ఏపీలో ఐటీ ని విస్తరించాలని లోకేష్ చూస్తున్నారు. తద్వారా తన తండ్రికి హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతగా వచ్చిన పేరును తానూ సంపాదించుకోవాలని చూస్తున్నారు. అదే విధంగా భారీ పరిశ్రమలను ఏపీకి తీసుకుని రావడం ద్వారా పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా లోకేష్ తన మార్క్ చూపించాలని ఆరాటపడుతున్నారు.
ఇక విద్యా శాఖలో సైతం ఆయన సంస్కరణలు చేపట్టాలని చూస్తున్నారు. ఏపీలో ఉన్న మొత్తం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాటికి అందించడం, అలాగే అప్ టూ డేట్ గా ఏపీలో విద్యా వ్యవస్థ ఉండేలా చూడడం, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం వంటివి చేయాలని లోకేష్ భారీ టార్గెట్లే పెట్టుకున్నారు.
ఇక లోకేష్ తన యాక్షన్ ప్లాన్ లో భాగంగా వచ్చే నెల నుంచి ఏపీలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించేలా లోకేష్ ప్రొగ్రాం డిజైన్ చేసి పెట్టుకున్నారు. అంతే కాదు రానున్న రెండేళ్ళ కాలంలో తన శాఖల ద్వారా ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే ఆకస్మిక తనిఖీల పేరుతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలను లోకేష్ సందర్శించారు. ఇక వచ్చే నెల నుంచి ఈ తరహా సందర్శనలు ఉంటాయని అంటున్నారు. తద్వారా ఆయా పాఠశాలలలో నెలకొన్ని పరిస్థితులు అక్కడి సమస్యలు విద్యా వాతావరణం ఇవన్నీ కూడా తెలుస్తాయని దాంతో పరిష్కారాలు చేయడం సులువు అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో చాలా మంది విద్యా శాఖ మంత్రులుగా పనిచేశారు. అయితే మండలి వెంకట కృష్ణారావు 1970 దశకంలో విద్యా శాఖ మంత్రిగా కాంగ్రెస్ హయాంలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎన్టీఆర్ హయాంలో ముద్దు క్రిష్ణమనాయుడు విద్యా శాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు సాధించారు.
ఇపుడు చూస్తే చిన్న వయసులోనే ఈ పదవిని చేపట్టిన నారా లోకేష్ సైతం మంచి విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. దాంతో ఏపీలో విద్యా రంగానికి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.