సోషల్ మీడియా డిస్కషన్ : వీళ్ళు ఏంటి ఇంత ఫ్రెండ్స్ అయ్యిపోయారు
సమ్మిట్ లో నాగార్జున ఎంతో చురుకుగా పాల్గొనడమే కాకుండా సీఎం రేవంత్ పక్కనే నిలబడి కార్యక్రమాలను పర్యవేక్షించారు.;
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్ అగ్రహీరో నాగార్జునల మద్య కనిపించిన సాన్నిహిత్యం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమ్మిట్ లో నాగార్జున ఎంతో చురుకుగా పాల్గొనడమే కాకుండా సీఎం రేవంత్ పక్కనే నిలబడి కార్యక్రమాలను పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యాక పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను చెరువులో కట్టారని హైడ్రా కూల్చివేసింది. హైడ్రా అధికారులు పోలీసులు చెరువు శిఖంలో ఉండడం వల్లే కూల్చారని వివరణ కూడా ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ సైతం చట్టం తన పని తాను చేసుకుపోతుందని క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ ను మేం ఏం టార్గెట్ చేయలేదంటూ విమర్శలకు బదులిచ్చారు.
అయితే సోషల్ మీడియాలో, మీడియాలో మాత్రం నాగార్జునను , టాలీవుడ్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు తనను గుర్తించలేదనే రేవంత్ ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. కానీ రేవంత్ సహా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తమ జోక్యం లేదని హైడ్రా అన్ని చెరువులను ఇలానే రక్షిస్తుంది అంటూ వివరణ ఇచ్చారు.
ఇక ఈ వివాదంలో నాగార్జున సైతం చెరువు శిఖంలో ఉన్న తన ఆస్తులు, ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలను వదిలేసి ప్రభుత్వానికి సహకరించారు. అధికారులకు అప్పగించారు. ప్రభుత్వంతోనూ ఆయన వైరానికి పోకుండా చట్టం ప్రకారం నడుచుకున్నారు.
అయితే రేవంత్, నాగార్జునకు మధ్య వైరం ముదిరిందని.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మీడియా కూడా హైలెట్ చేసింది.
కానీ నాగార్జున మాత్రం టాలీవుడ్ తరుఫున రేవంత్ ను, కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ టాలీవుడ్ సమస్యలను పరిష్కరించే క్రమంలో సన్నిహితంగా మెలిగారు. ఇప్పటికే రేవంత్ ను రెండు మూడు సార్లు కూడా కలిశారు.
తాజాగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లోనూ ఆహ్వానం మేరకు కలిసి అన్నపూర్ణ స్టూడియోను విస్తరించి ఫ్యూచర్ సిటీలోనూ తాము కడుతామని.. భూములు ఇస్తే ఈ పెట్టుబడి పెడుతామని ప్రకటించారు. దీంతో రేవంత్, నాగార్జున మధ్యన ఏదో ఉందన్న ప్రచారానికి తెరపడింది. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతూ ఏలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి సాగడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ప్రచారానికి తెరపడినట్టైంది.
గతంలో అల్లు అర్జున్ కేసు విషయంలోనూ రేవంత్ , అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం సాగింది. కానీ రేవంత్ చేతుల మీదుగానే అల్లు అర్జున్ అవార్డ్ ను అందుకోవడం.. ఇద్దరూ సన్నిహితంగా మెలగడంతో ఈ ప్రచారానికి తెరపడింది. టాలీవుడ్ పెద్దలకు, రేవంత్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఉట్టిదేనని తేలిపోయింది.