నాగబాబు అక్కడి నుంచి తప్పుకున్నారా?

కాగా అనకాపల్లి నుంచి పవన్‌ సోదరుడు, ప్రముఖ సినీ నటుడు నాగబాబు పోటీ చేస్తారని టాక్‌ నడిచింది.

Update: 2024-03-02 11:15 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ , జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాయి. అయితే ఇంతవరకు బీజేపీ ఏ విషయం తేల్చిచెప్పలేదు. బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధమవుతుందని తెలుస్తోంది.

కాగా జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తుందని తెలుస్తోంది. కాగా అనకాపల్లి నుంచి పవన్‌ సోదరుడు, ప్రముఖ సినీ నటుడు నాగబాబు పోటీ చేస్తారని టాక్‌ నడిచింది.

ఈ నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా కాపు ఓటర్లు ఉన్నారు. ఈ కారణంతోనే నాగబాబు పోటీకి మొగ్గుచూపారని టాక్‌ నడిచింది. అయితే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ ఉంది. దీంతో నాగబాబు ఈ విషయంలో పోటీకి ఆలోచిస్తారని అంటున్నారు. అంతేకాకుండా టీడీపీతో కలిసి పొత్తులో పోటీ చేస్తుండటంతో సీట్ల సమీకరణాలు కూడా తన పోటీకి అనుకూలించవని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

2009లో అనకాపల్లి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అల్లు అరవింద్‌ ఓటమి పాలయ్యారు. ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. అల్లు అరవింద్‌ పై నాడు కాంగ్రెస్‌ అభ్యర్థి సబ్బం హరి విజయం సాధించారు. ప్రస్తుతం నాగబాబు కుటుంబ స్నేహితుడు అయిన సుందరపు సతీశ్, అతడి సోదరుడు యలమంచిలి, గాజువాక స్థానాలను ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే గాజువాకకు టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది.

Read more!

దీంతో ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి ఆర్థికంగా, సామాజికంగా గట్టి అండగా నిలిచిన సుందరపు ఫ్యామిలీ కొంత నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి తదితర సీట్లను ఆశించేవారు ఎక్కువయ్యారు. ఈ సీట్లలో టీడీపీకి కూడా గట్టి అభ్యర్థులున్నారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పోటీ చేయనుంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి బరిలోకి దిగనున్నారు.

జనసేన పార్టీ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అత్యధిక సీట్లలో పోటీ చేయనుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో జనసేన ఆశిస్తున్న సీట్లలోనే టీడీపీకి సైతం గట్టి అభ్యర్థులు ఉన్నారు. దీంతో సీట్ల విషయంలో కొంత తకరారు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబుని అనకాపల్లి నుంచి పోటీ చేయించే విషయంలో పవన్‌ కళ్యాణ్‌ కొంత డైలమాలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతానికి అనకాపల్లి నుంచి నాగబాబుని పోటీ చేయించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News