జనసేనకు 100% స్ట్రైక్ రేట్... సమాచారం ఉందంటున్న నాగబాబు!

టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం జనసేనకు 21 స్థానాలు కేటాయించడంపై ఒకవర్గం నుంచి తీవ్ర విమర్శలు వెలువడిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-23 05:20 GMT

టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం జనసేనకు 21 స్థానాలు కేటాయించడంపై ఒకవర్గం నుంచి తీవ్ర విమర్శలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై వివరణ ఇచ్చిన పవన్ కల్యాణ్... ఎన్ని సీట్లు అన్నది ముఖ్యంకాదు.. 98శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యం అన్నట్లుగా తెలిపారు. అయితే... 98% కాదు, తమకున్న సమాచారం మేరకు 100శాతం స్ట్రైక్ రేట్ కన్ఫాం అని అంటున్నారు నాగబాబు.

అవును... అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలూ కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బీజేపీ మద్దతూ ఫలించాయని.. ఫలితంగా కూటమికే పట్టం కట్టాలని ప్రజలు తీర్పు ఇచ్చారని నాగబాబు తెలిపారు. ఇదే సమయంలో జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవని చెప్పుకొచ్చిన నాగబాబు... జనసేన రంగంలోకి దింపిన ప్రతీ అభ్యర్థినీ ఐవీఆరెస్స్, ప్రజాభిప్రాయ సేకరణల ఆధారంగా జాగ్రత్తగా ఫిల్టర్ చేశారని నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నాగబాబు చెబుతున్నట్లు నిజంగా 21 కి 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిస్తే మాత్రం అది కచ్చితంగా సరికొత్త చరిత్ర అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఫలితాల విషయాంలో నాగబాబు జోస్యం నిజమవుతుందా.. లేక, ఏమవుతుందనేది వేచి చూడాలి. కాగా... జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News