మినిస్టర్ నాగబాబు... ఏడాది దొర్లింది

రాజకీయాల్లోనే కాదు ఎక్కడైనా కూడా అదృష్టంతో పాటు అన్నీ కలసి రావాలి. చేతికి నోటికీ మధ్య కూడా కనబడని యోజనాల దూరం ఉంటుంది.;

Update: 2025-12-10 03:49 GMT

రాజకీయాల్లోనే కాదు ఎక్కడైనా కూడా అదృష్టంతో పాటు అన్నీ కలసి రావాలి. చేతికి నోటికీ మధ్య కూడా కనబడని యోజనాల దూరం ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మెగా బ్రదర్ ఎమ్మెల్సీ జనసేన నేత నాగబాబు విషయంలో చూసుకుంటే ఈ తరహా అలోచనలు రాకుండా మానవు. ఇంతకీ ఏమిటి నాగబాబు విషయం అంటే రాజకీయంగా ఆయనకు ఆశ నిరాశల మధ్యన గడచిన ఒక ఏడాది కాలంగా డిసెంబర్ 9ని గుర్తు చేసుకోవాలి. సరిగ్గా ఏడాది క్రితం 2024 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే ఏపీ కూటమి సారధిగా ఒక కీలక ప్రకటన చేశారు. నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటామని ట్వీట్ వేశారు. అయితే అది జరిగి ఒక సంవత్సరం కావస్తోంది కానీ అవాల్సింది అయితే కాలేదు.

ఎమ్మెల్సీగా ఉన్నా కూడా :

ఇక నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ట్వీట్ చేసేనాటికి ఆయన ఏపీలోని ఉభయ సభలలో ఎక్కడా సభ్యుడు అయితే కారు. కానీ ఈ ఏడాది మార్చి 30 నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పటికి ఏడు నెలలుగా ఆయన చట్ట సభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు మంత్రి పదవి చేపట్టాలంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయితే సరిపోతుంది. అలా చూసుకుంటే ఆ లాంచనం కూడా పూర్తి అయింది. కానీ ఎందుకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అన్నది ఒక చర్చగానే ఉంది.

అదే అడ్డంకిగా :

అయితే టీడీపీ వైపు నుంచి ఏ రకమైన ఇబ్బంది లేదని అంటున్నారు. ఏకంగా కూటమి సారధి హోదాలో చంద్రబాబే నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని ప్రకటించారు కాబట్టి ఆ సైడ్ నుంచి ఏమీ ఇబ్బంది లేదు, ఇక జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ కూడా అభ్యంతరం పెట్టేది ఉండదు, 21 మంది ఎమ్మెల్యేలు కలిగి కూటమిలో రెండవ అతి పెద్ద మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కేబినెట్ లో నాలుగు బెర్తులు ఇవ్వడం సబబే అని అంతా అంటారు. మరి అడ్డంకి ఏమిటి అంటే సామాజికపరమైన కూర్పే అని అంటున్నారు. అది కూడా జనసేనలోనే అని చెబుతున్నారు.

బంతి ఆయన కోర్టులోనే :

ఇక నాగబాబుకు మంత్రి పదవి అన్నది ఇవ్వడం వరకూ ఓకే కానీ అనుమతి ఇచ్చేంది మాత్రం జనసేన అధినేత అని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఓకే అనాల్సి ఉంది అని చెబుతున్నారు. పవన్ కి కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ఆనందమే. కానీ ఆయన పార్టీ అధినేతగా రాజకీయ ప్రాంతీయ సామాజిక సమీకరణలు అన్నీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. జనసేనలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉంటే అందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో మరో పదవి అదే సామాజిక వర్గానికి దక్కితే అది పార్టీకి అంత మంచిది కాదని వేరే విధంగా సంకేతాలు వెళ్తాయని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. ఇక చూస్తే 2026 లో కూటమి రెండేళ్ళ పాలన పూర్తి అయిన తరువాత మార్పులు చేర్పులు మంత్రి వర్గంలో ఉంటాయని ఆ సమయంలో జనసేనలోనూ మంత్రి పదవుల మార్పు జరిగితే తప్పకుండా నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News