డబ్బుల వృథా.. అందుకే DOGE నుండి మస్క్ బయటకొచ్చారా? ట్రంప్ బిల్లుపై అసంతృప్తి!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక భారీ బిల్లుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.;
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక భారీ బిల్లుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ట్రంప్ ఏర్పాటు చేసిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)' అనే విభాగం నుంచి మస్క్ ఇటీవల వైదొలిగిన నేపథ్యంలో, ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఆ బిల్లు ఏంటి? మస్క్ ఎందుకు అంత తీవ్రంగా స్పందించారో తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఒక కొత్త బిల్లుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "క్షమించండి, నేను ఇంతకంటే భరించలేను. ఇది అత్యంత దారుణమైనది. కాంగ్రెస్‌లో తీసుకొచ్చిన ఈ బిల్లు తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం" అని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో కామెంట్స్ చేశారు.
ఈ బిల్లు వల్ల అమెరికా ద్రవ్యలోటు ఏకంగా 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని మస్క్ హెచ్చరించారు. దీనివల్ల అమెరికన్ పౌరులపై భరించలేని ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ ఈ బిల్లును అనవసరమైన ఖర్చులతో నిండినదిగా అభివర్ణించారు.
ఎలాన్ మస్క్ గతంలో ట్రంప్ ఏర్పాటు చేసిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)' అనే ప్రభుత్వ విభాగం నుంచి ఇటీవల వైదొలిగారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం DOGE ప్రధాన లక్ష్యాలు. అయితే, ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన ఈ కొత్త ట్యాక్స్ బిల్లు, అధిక బడ్జెట్‌ను కేటాయించాల్సిన అవసరం ఏర్పడడంతో, DOGE ఆశయాలకు గండి కొడుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి DOGE చేపట్టిన చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే మస్క్ DOGE బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఈ బిల్లు ట్రంప్ 2017లో ఆమోదించిన పన్ను కోతలను పొడిగించడంతో పాటు, సరిహద్దు భద్రత, దేశ భద్రత కోసం భారీగా 350 బిలియన్ డాలర్ల నిధులను పెంచేందుకు ఉద్దేశించబడింది. అయితే, ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత టెక్నాలజీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మస్క్ వ్యాపార ప్రయోజనాలకు నష్టం కలిగించవచ్చు. మస్క్ చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలను వైట్‌హౌస్ వెంటనే ఖండించింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ మాట్లాడుతూ.. "ఈ బిల్లుపై ఎలాన్ మస్క్ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్‌నకు తెలుసు. అయితే, మస్క్ వ్యాఖ్యలు అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చవు" అని పేర్కొన్నారు. రానున్న బిల్లు గొప్పదని, ట్రంప్ దానికి కట్టుబడి ఉన్నారని ఆమె తెలిపారు.