ఆధార్ ఇచ్చి.. బొట్టు పెట్టుకొని.. గోమూత్రం చల్లుకుంటేనే ఎంట్రీ

అంతేకాదు.. గర్బా సెలబ్రేషన్స్ కు వచ్చే వారి ఆధార్ ను పరిశీలించాలని.. నుదుటిపై బొట్టు పెట్టుకున్న తర్వాతే ఎంట్రీ ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Update: 2026-10-08 09:22 GMT

నవరాత్రుల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే గర్బా వేడుకల్లో పాల్గొనే వారు కచ్ఛితంగా నుదట బొట్టు పెట్టుకోవాలని.. ఆధార్ కార్డును సమర్పించి.. చేతికి కలవా కట్టుకొని.. గోమూత్రం చల్లుకునే వారిని మాత్రమే అనుమతిస్తామన్న పోస్టర్ ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. ముంబయిలోని మలాడ ప్రాంతంలో నిర్వహించే ఒక గర్బా వేదిక వద్ద ఈ పోస్టర్ కనిపించింది. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో లవ్ జిహాద్ ఇష్యూను అధిగమించేందుకు ఇదే సరైన దారి అన్న మాట కొందరి నోట వినిపిస్తుంటే.. ఈ వాదనను తప్పు పడుతున్న వారూ ఉన్నారు.

అత్యంత వైభవంగా జరిపే గర్బా వేడుకల్లో పాల్గొనే హిందూ యువతులను మత మార్పిడికి గురి చేసే ఉద్దేశంతో ముస్లిం పురుషులు లవ్ ప్రపోజ్ చేస్తారని.. అలాంటి తీరుకు కట్టడి చేసేందుకు లవ్ జిహాద్ పదాన్ని పలువురు వాడుతున్నారు. గుజరాత్ లో ఇలా ఉంటే ముంబయిలో గర్బా కార్యక్రమాల్లో ముస్లింల ప్రవేశంపై ఇప్పటికే వివాదం నడుస్తోంది. మహారాష్ట్రలో దాండియా కార్యక్రమాలకు ముస్లింలను అనుమతించకూడదని గతంలోనే విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వటం తెలిసిందే.

అంతేకాదు.. గర్బా సెలబ్రేషన్స్ కు వచ్చే వారి ఆధార్ ను పరిశీలించాలని.. నుదుటిపై బొట్టు పెట్టుకున్న తర్వాతే ఎంట్రీ ఇవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు. ముంబయిలోని గర్బా వేడుకల నిర్వాహకుల తాజా డిమాండ్ కు మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే మద్దతు తెలపటం గమనార్హం. ఈ పెద్ద మనిషి గర్బా వేడుకలకు హాజరయ్యే వారు ఆధార్ చూపించటమే కాదు హనుమాన్ చాలీసా పఠించాలని గతంలో ఆయన పేర్కొన్నారు.

నవరాత్రి వేడుకలు దగ్గర పడుతున్న క్రమంలో గర్బా వేడుకలకు హాజరయ్యే వారు ఏమేం చేయాలన్న పరిమితులతో కూడిన కొత్త పోస్టర్లు ఇప్పుడు కలకలాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ తరహా పోస్టర్లు సామాజిక సమగ్రతపై కొత్త సందేహాలు వ్యక్తం చేయటమే కాదు.. ఈ తీరు హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News