మూలపేట పోర్టు రాజకీయం.. ఇప్పుడు టీడీపీ వంతు!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట పోర్టు కేంద్రంగా రాజకీయం ఊపందుకుంది.;

Update: 2026-04-06 18:30 GMT

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట పోర్టు కేంద్రంగా రాజకీయం ఊపందుకుంది. సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మూలపేట పోర్టు క్రెడిట్ కోసం అధికార, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ‘మూలపేట పోర్టు చూసొద్దాం రండి’ అంటూ పోర్టుకు సమీపంలోని నౌపడలో భారీ సమావేశం నిర్వహించారు. మూలపేట పోర్టు నిర్మాణం తమ పార్టీ ఘనతే అని చాటుకున్నారు.




ఇక సోమవారం మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దనరెడ్డి పోర్టును సందర్శించారు. కూటమి ప్రభుత్వంలో పనులు జరిగితే వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇలా రెండు పార్టీలు పోర్టుపై క్రెడిట్ కోసం తాపత్రయం పడటం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వైసీపీ నేతలు రోజుకో అజెండా.. పూటకో ఈవెంట్ తో ప్రజలు ముందుకు వస్తున్నారని మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దనరెడ్డి విమర్శలు గుప్పించారు. తమ హయాంలోనే మూలపేట పోర్టు నిర్మాణం పూర్తవుతోందని, వైసీపీ అధికారంలో ఉండగా కేవలం 25 శాతం పనులు మాత్రమే చేశారని మంత్రులు చెబుతున్నారు.




అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోర్టు కోసం ఉప్పు శాఖ ఆధ్వర్యంలో ఉన్న మూడు వందల ఎకరాల భూములను తామే సేకరించామని మంత్రులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోర్టు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారని మంత్రులు వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

దాదాపు రూ. 4361.91 కోట్లతో చేపట్టిన మూలాపేట పోర్టు పనుల్లో ఫేజ్ 1లో 1524 ఎకరాల్లో 4 బెర్త్ ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తొలుత 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భూ సేకరణలో జాప్యం కారణంగా 2026 నవంబర్ నాటికి పోర్టును ప్రారంభించాలన్న దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.

మూలాపేట పోర్టు ఉత్తరాంధ్రలో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉంది. రాజకీయంగా అభివృద్ది పరంగా చాలా ప్రాధాన్యం ఉండటంతో అధికార, విపక్షాలు పోర్టును తమ ఘనతగా చెప్పుకోడానికి పోటీ పడుతున్నాయని అంటున్నారు.

మూలపేట పోర్టుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే సోమవారం పోర్టుకు వచ్చామని మంత్రులు బహిరంగంగా చెప్పడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత వారం నౌపడలో బహిరంగ సభ పెట్టిన వైసీపీ నేతలు మూలపేట పోర్టు పనుల క్రెడిట్ ను తమ అకౌంటులో వేసుకునే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు అంతా ఒకే వేదికపైకి వచ్చి మూలపేట పోర్టును తమ హయాంలో దాదాపుగా పూర్తి చేశామని, మిగిలిన కొద్ది పనులు పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రులు పర్యటించి తమ హయాంలో చేపట్టిన పనుల వివరాలను వెల్లడించారు. మొత్తానికి రెండు వైపుల నుంచి లెక్కల యుద్ధం ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News