ముద్రగడ గ్రాఫ్ ని కూటమి పెంచిందా ?
ముద్రగడ పద్మనాభ రెడ్డి అలియాస్ పద్మనాభం ఒంటరి వారు కాదు అని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అదే నిజం అయింది.;
ముద్రగడ పద్మనాభ రెడ్డి అలియాస్ పద్మనాభం ఒంటరి వారు కాదు అని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అదే నిజం అయింది. ఆయన ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్నా ఆయన మద్దతు ఇచ్చిన వైసీపీ అభ్యర్ధి పిఠాపురంలో ఓడి బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచినా దాని ఫలితంగా తన ఒంటి పేరునే మార్చుకుని నాకెందుకొచ్చిన రాజకీయం అని చాన్నాళ్ళుగా మౌన ముద్రలో ఉన్నా ముద్రగడ పవర్ ఏ మాత్రం తగ్గలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ముద్రగడ పేరులోనే ఒక పవర్ ఉంది. ఆయన 1990 దశకంలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఉంటూ కాపు ఉద్యమాన్ని నడిపారు. ఎవరినీ లెక్క చేయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఏపీలో ముద్రగడ దీక్షకు దిగి వచ్చింది. ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న కోట్ల విజయభాస్కర రెడ్డి జీవో 30 పేరుతో కాపులను బీసీలలో చేరుస్తున్నామని పేర్కొంటూ ముద్రగడ దీక్షకు అపరిమిత విజయం అందించారు.
అలా మారుమోగిన ముద్రగడ పేరు ఇపుడు కూడా అలాగే ఉందని అంటున్నారు. టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి చంద్రబాబుతో కూడా సహచరుగా ఒకనాడు ఉన్న ముద్రగడ 2014 నుంచి బాబుని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాపులను బీసీలలో చేరుస్తామని బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని పట్టుకుని ముద్రగడ ఆ సమయంలో అతి పెద్ద ఉద్యమమే నడిపారు.
దాంతో బాబుతోనే నేరుగా ఢీ కొట్టారు. ఆ తరువాత ముద్రగడని పోలీసులు నిర్బంధించడం వంటివి జరిగాయి. అదే విధంగా తుని సభలో జరిగిన విధ్వంసం వల్ల రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగులబడిపోయింది. దానికి బాధ్యుడిగా ఉద్యమ నేత ముద్రగడ సహా కీలక నేతల మీద కేసులు నమోదు అయ్యాయి. అలా ముద్రగడ చాన్నాళ్ళ పాటు కేసుల పని మీద విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో తిరిగారు.
ఇక ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముద్రగడ మీద ఉన్న కేసులను ఆయనతో పాటుగా కాపు ఉద్యమ నేతల మీద కేసులను కొట్టేసింది. అదే విధంగా తుని రైలు దగ్దం కేసులో తిరిగి అప్పీల్ కు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు.
దాంతో తెర వెనక ఏమి జరిగి ఉంటుంది అన్నది బయటకు రాకపోయినా ముద్రగడ పరపతి అమాంతం పెరిగింది అని అంటున్నారు. ఈ కేసులను తిరగతోడితే ఏడు పదుల వయసులో ఉన్న ముద్రగడకు ఇబ్బంది అవుతుంది. కానీ అంతకంటే కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాళ్ళు ఎదురవుతాయని అంటున్నారు.
అసలే ముద్రగడ మొండి ఘటంగా పేరు పొందారు. ఆయన తన పేరుని మార్చుకుంటాను తానుగా చెప్పి ఎవరూ డిమాండ్ చేయకపోయినా మార్చేసుకున్నారు. అలాంటిది ఇపుడు ఈ కేసులు తిరగతోడితే కచ్చితంగా ముద్రగడ సీన్ లోకి వస్తారు అని అంటున్నారు. ఆయన కనుక వస్తే కాపు సమాజం మరోసారి ఆయన వెంట ఉంటుందని అది అంతిమంగా కూటమికే చేటు తెస్తుందని తలచే ఈ విధంగా చేశారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ముద్రగడ ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆయన ఏమి చేసినా ఆయన ఆందోళనల వెనక వైసీపీ ఉంటుంది. ఆ విధంగా రాజకీయంగా వైసీపీకే మేలు జరుగుతుంది. దాంతో అది జరగకూడదు అన్న ముందు చూపుతోనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా గత కొంతకాలంగా వార్తల్లో లేని ముద్రగడకు ఈ విధంగా అయాచితంగా ప్రచారం కూటమి ప్రభుత్వం కల్పించినట్లు అయింది అని అంటున్నారు.
కూటమి వెనక్కి తగ్గడానికి కారణాలు ఏవి అయినా ముద్రగడ వెంట కాపులు ఉన్నారన్న సంకేతాన్ని పరోక్షంగా అందించడం ద్వారా ఆయన గ్రాఫ్ ని అమాంతం పెంచినట్లు అయింది అని అంటున్నారు. మరి ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న ముద్రగడ సరైన సమయం చూసుకుని మరీ తన వాయిస్ ని ఈసారి స్ట్రాంగ్ గానే వినిపించడం ద్వారా జనం ముందుకు వస్తారు అని అంటున్నారు.