'ఆపరేషన్ సిందూర్' పై చర్చ విషయంలో హస్తిన నుంచి కీలక అప్ డేట్!
ఈ రోజు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉభయ సభల్లోని నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు.;
ఆపరేషన్ సిందూర్, భారత్ - పాక్ కాల్పుల విరమణ, దీనిపై ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలు, ఈ యుద్ధంలో భారత్ కు ఏమైనా నష్టం జరిగిందా, మొదలైన విషయాలపై పార్లమెంటులో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలనే డిమాండ్ చేశాయి. ఈ సమయంలో హస్తిన నుంచి కీలక అప్ డేట్ వచ్చింది.
అవును... ఈ నెల 21 (సోమవారం) నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక అంశాలపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశం నుండి దూరంగా ఉండదని, సభను సజావుగా నడపడానికి కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ రోజు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉభయ సభల్లోని నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి, రాజ్యసభాపక్షనేత జేపీ నడ్డా అధ్యక్షత వహించారు. ఇక్కడ.. పహల్గాం ఉగ్రదాడి, ట్రంప్ కాల్పుల విరమణ వాదనలు, బిహార్ లో ఓటర్ల జాబితా వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి.
ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ రిజిజు.. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రతిపక్షాల లేవనెత్తే అంశాలపై తగిన విధంగా స్పందిస్తామని అన్నారు. అయితే... సమావేశాలు సజావుగా సాగడంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఈ వర్షాకాల సమావేశాల్లో 17 బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చల సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని అన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో 51 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి, 54 మంది సభ్యులు హాజరయ్యారు. దీంతో... ఈ సమావేశాన్ని నిర్మాణాత్మకంగా అభివర్ణించారు రిజుజు.
అదేవిధంగా... జస్టిస్ యశ్వంత్ వర్మ అంశంపైనా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ సందర్భంగా యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారని, దీనిని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని యోచిస్తోందని తెలిపారు.