కూల్చుతామన్న 'ఫాంహౌజ్' నుంచే బీఆర్ఎస్ ను చీల్చుతున్న బీజేపీ
ఫాంహౌజ్ పార్టీ అని కూడా ఎద్దేవా చేస్తుంటాయి. సరిగ్గా మూడేళ్ల కిందట మరో ఫాంహౌజ్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.;
మానసిక ప్రశాంతత, రాజకీయ రణగొణ ధ్వనులకు దూరంగా అధినేత కేసీఆర్ అత్యధిక సమయం గడిపే ఫాంహౌజ్ కారణంగా బీఆర్ఎస్ ను ప్రత్యర్థి పార్టీలు తరచూ విమర్శిస్తుంటాయి. ఫాంహౌజ్ పార్టీ అని కూడా ఎద్దేవా చేస్తుంటాయి. సరిగ్గా మూడేళ్ల కిందట మరో ఫాంహౌజ్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. అదే హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌజ్. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు రూ.వందకోట్లు, కాంట్రాక్టులు ఎరవేసి వారిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై అధినేత కేసీఆర్ కు ముందే ఉప్పందడంతో మొయినాబాద్ ఫాంహౌస్ కుట్రను భగ్నం చేశామని చెప్పుకొచ్చింది. ఇది జరిగింది 2022 నవంబరులో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికకు ముందు.
ఆ ఎమ్మెల్యేలను వెంటేసుకుని..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో బలంగా ఉపయోగించుకుంది. బీజేపీ వల విసిరిన ఎమ్మెల్యేలు (గువ్వల బాలరాజు-అచ్చంపేట, పైలట్ రోహిత్ రెడ్డి-తాండూరు, బీరం హర్షవర్ధన్ రెడ్డి-కొల్లాపూర్, రేగా కాంతారావు-పినపాక) ను కేసీఆర్ తన వెంట ప్రచారంలో తిప్పారు. మీడియా సమావేశంలోనూ వారిని చూపించారు. రూ.వంద కోట్లకూ తలగ్గొని తమ ఎమ్మెల్యేలు అంటూ గొప్పగా చెప్పారు. ఇదంతా ఫలించి మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పది వేల ఓట్లతో గెలుపొందింది.
నాడు బీజేపీకి దెబ్బ
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2022లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బలమైన నాయకుడు అయిన ఆయనను ఓడించడం కష్టమే అనే అభిప్రాయం ఏర్పడింది. మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని అందరూ భావించారు. కానీ, చివర్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం చేసిందంటూ కేసీఆర్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసి విజయం సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు అక్కడి నుంచే మొదలు..
తెలంగాణలో అధికారం అనే కలను సాకారం చేసుకునే దిశలో... మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు అత్యంత అవసరం అని బీజేపీ భావించింది. కానీ, ఆ ఓటమితో అంతా మారిపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయింది. మునుగోడులో ఓటమి, అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబాటుకు పరోక్ష కారణం.. మొయినాబాద్ ఫాంహౌజ్ అంశమేనని కమలనాథుల భావన. అందుకనే అక్కడినుంచే నరుక్కొచ్చే పని చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆపరేషన్ ఆకర్ష్ లో తమవైపు తిప్పుకొంది. మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనలో ఉన్న మరో ఎమ్మెల్యే కూడా తర్వలో బీజేపీలో చేరతారని చెబుతున్నారు. అంటే.. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్లీ వెదుక్కోవడం అన్నమాట. నాడు కేసీఆర్ ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రకటనలు చేశారు.
నాడు నేడు బీఎల్ సంతోష్...
బీఎల్ సంతోష్.. కర్ణాటకకు చెందిన బీజేపీ అగ్రనేత. జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత). బీజేపీలో మోస్ట్ పవర్ ఫుల్. అలాంటి బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్ ప్రధాన పాత్రధారిగా పేర్కొంది. ఆయన అరెస్టుకు సైతం ప్రయత్నాలు సాగించింది. ఇప్పుడు అదే బీఎల్ సంతోష్.. నాటి మొయినాబాద్ ఫాంహౌజ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గువ్వలతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే ఆయనను కలుసుకోవడమే దీనికి నిదర్శనం.