నాటు కోళ్ల వ్యాపారి నుంచి టెకీ.. అంతర్జాతీయ మాఫియా వరకు.. మొయినాబాద్ కేసులో వీడని మిస్టరీ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు మునుపెన్నడూ లేనంత వేగంగా పుంజుకుంది.;

Update: 2026-03-21 05:17 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు మునుపెన్నడూ లేనంత వేగంగా పుంజుకుంది. ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఈ కేసులోని లోతుపాతులను తవ్వుతున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల చుట్టూ ఈ కేసు అల్లుకుని ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ.. ప్రజల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

అభిషేక్ సింగ్ కస్టడీ.. విచారణలో కీలక ఆధారాలు

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన వ్యక్తి డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లో ఎలా కీలకంగా మారారనే కోణంలో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ డేటా, కాల్ రికార్డులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లను విశ్లేషించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్, అభిషేక్ సింగ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలు లభించాయి. కేవలం ఒకట్రెండు సార్లు మాత్రమే కాకుండా రోహిత్ రెడ్డికి కనీసం 24 సార్లు మత్తు పదార్థాలు సరఫరా అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాటు కోళ్ల వ్యాపారి ‘సీన్’లోకి ఎలా వచ్చారు?

ఈ కేసులో అత్యంత విచిత్రమైన, ఆసక్తికరమైన అంశం ఎం. రమేశ్ అనే నాటు కోళ్ల వ్యాపారి ప్రమేయం. ఫాంహౌస్ సమీపంలోనే నివసిస్తూ రియల్ ఎస్టేట్, కోళ్ల వ్యాపారం చేసుకునే రమేశ్, అనుకోకుండా ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. "పెద్దసార్లు వస్తున్నారు.. మంచి నాటు కోళ్లు కావాలి" అంటూ రోహిత్ రెడ్డి అనుచరులు ఫోన్ చేయడంతో రమేశ్ అక్కడికి వెళ్లారు. అయితే దురదృష్టవశాత్తూ పార్టీ జరుగుతున్న సమయంలో అతను అక్కడే ఉండటంతో పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. "నాకు డ్రగ్స్‌తో సంబంధం లేదు.. కేవలం కోళ్లు ఇవ్వడానికే వెళ్లాను" అని అతను మొరపెట్టుకుంటున్నప్పటికీ సిట్ అధికారులు అతని వాంగ్మూలాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు.

అంతర్జాతీయ లింకులు.. దుబాయ్, ఢిల్లీకి సిట్ బృందాలు!

కేసు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదని, దీనికి అంతర్జాతీయ మూలాలు ఉన్నాయని ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. నిందితుల ఫోన్లలోని సమాచారం ప్రకారం దుబాయ్ నెట్‌వర్క్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరెవరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను దుబాయ్ మరియు ఢిల్లీకి పంపాలని సిట్ నిర్ణయించింది.

ఆర్థిక లావాదేవీలపై నిఘా

మరో నిందితుడు కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయాల గుట్టు రట్టవుతోంది. అభిషేక్ సింగ్ , కౌశిక్ రవి మధ్య జరిగిన తరచుగా జరిగిన సంభాషణలు డ్రగ్స్ సరఫరా చైన్‌ను స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసులో ఉన్న 11 మంది నిందితుల బ్యాంక్ ఖాతాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. భారీ ఎత్తున జరిగిన ఆర్థిక లావాదేవీలు ఎవరి ఖాతాల నుంచి ఎవరికి వెళ్లాయనేది తేలితే మరికొందరు 'పెద్దల' పేర్లు బయటపడే అవకాశం ఉంది.

ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం ఇచ్చే తీర్పు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. కోర్టు కస్టడీకి అనుమతిస్తే, సిట్ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News