నెక్స్ట్ పీఎం యోగీనా...అమిత్ షానా ?
కేవలం రెండు నెలలు మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయసు 75 నిండుతాయి. సెప్టెంబర్ 17 కి ఆయన 76వ పడిలోకి ప్రవేశిస్తారు.;
కేవలం రెండు నెలలు మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయసు 75 నిండుతాయి. సెప్టెంబర్ 17 కి ఆయన 76వ పడిలోకి ప్రవేశిస్తారు. అంటే ఇక్కడే ఇటీవలనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వార్తలు గుర్తుకు వస్తున్నాయి. ఏడున్నర పదుల వయసు నిండిన వారు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలే ఇటీవల చేశారు.
ఆయన జనరల్ గా చేసినట్లు అనిపిస్తున్నా మోడీ 75 ఏళ్ళకు దగ్గరగా ఉండడంతో ఆయన మీదనే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు ఆర్ఎస్ఎస్ అంటేనే బీజేపీకి మార్గదర్శిగా ఉంటూ వస్తోంది. కాబట్టి ఎవరో కాదు ఏ పార్టీకో అంతకంటే కాదు బీజేపీకే అది కూడా మోడీకే సలహా ఇచ్చినట్లుగా ఉందని విశ్లేషణలు అయితే మొదలయ్యాయి.
సరే బీజేపీకే మోడీకే ఈ కామెంట్స్ అని అనుకున్నపుడు మోడీ నిజంగా దానిని పాటించాలని అనుకున్నప్పుడు ఆయనే తప్పుకున్నపుడు బీజేపీలో మోడీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అన్నది మరో చర్చగా ఉంది. మోడీ తరువాత ప్రధాని పదవికి పోటీ పడే వారు ఎవరెవరు అంటే చాలా పేర్లు వినిపిస్తాయి.
అయితే బీజేపీది హిందూత్వ నినాదం. ఆర్ఎస్ఎస్ కూడా దానినే గట్టిగా ప్రచారం చేస్తూ ఉంటుంది. మరి ఆ వాదాన్ని ఏ రకమైన వివాదం లేకుండా జనంలోకి తీసుకుపోవడానికి ఒక పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి. ఒక వైపు నాయకుడిగా ఉంటూనే మరో వైపు బీజేపీ హిందూత్వను జనంలో పెట్టి ఆకట్టుకునే ఘన నేత ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
అలా చూస్తే కనుక ఆర్ఎస్ఎస్ మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు యోగి ఆదిత్యనాథ్ అని అంటున్నారు. ఆయన 2017లో ఉత్తరప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎనిమిది ఏళ్ళుగా ఆయన సీఎంగానే ఉంటున్నారు. మరో రెండేళ్ళలో యూపీ ఎన్నికలు ఉన్నాయి. ఇక యోగీ యూపీ సీఎం అయ్యేంతవరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆయన సీఎం అయ్యాక తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఆయన యూపీలో తనదైన శైలిలో పాలన చేస్తున్నారు.
కరడు కట్టిన హిందూత్వకు ఆయన ప్రతిరూపంగా కనిపిస్తారు. ఆయన హయాంలోనే యూపీలో అయోధ్యలో రామమందిరం సాధ్యపడింది. యోగీ బ్రహ్మచారి. సనాతన ధర్మ నిష్ఠా గరిష్టుడు. ఏ బాదరబందీ లేనివారు. తన సొంత కుటుంబాన్నే ఆయన రాజకీయాలకు అధికారానికీ దూరం ఉంచారు. ఇలా చూస్తే కనుక యోగీకి ఎన్నో ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి.
మోడీ కనుక ప్రధాని పదవి నుంచి దిగిపోతే యోగీనే తరువాత పీఈం గా చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా తపన పడుతోంది అని ప్రచారంలో అయితే ఉంది. అయితే మోడీ కనుక అనివార్యంగా తన పదవి నుంచి తప్పుకుంటే కనుక తన వారసుడిగా అమిత్ షా పేరునే సూచిస్తారు అని అంటున్నారు. గత పదకొండేళ్లుగా చూస్తే కనుక బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ మోడీ అమిత్ షాలదే పట్టు అన్నది కూడా చెబుతారు.
అంతే కాదు మోడీ కంటే కూడా సంస్థాగతంగా అమిత్ షా పట్టు సాధించి ఉన్నారని అంటారు. బీజేపీలోనూ ప్రభుత్వంలోనూ అన్ని వ్యవహారాలూ అమిత్ షాయే దగ్గరుండి చూసుకుంటారు అని కూడా చెబుతారు. ఇదంతా మోడీ తర్వాత ఆయనే అని బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. మోడీ అమిత్ షా ఇద్దరూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు. మోడీ దిగిపోతే అదే రాష్ట్రానికి చెందిన వారికే చాన్స్ దక్కాలని కూడా ఉంటుందని అంటారు.
అంతే కాదు మొరార్జీ దేశాయ్ తరువాత దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత గుజరాత్ నుంచి దేశానికి ప్రధాని అయ్యే చాన్స్ వచ్చింది. మళ్ళీ ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఉంటుంది కాబట్టి అమిత్ షానే ప్రకటించవచ్చు అన్నది కూడా మరో చర్చ. ఇక ప్రధాని పీఠానికి అతి సమీపంలో అమిత్ షా ఉన్నారని కూడా ఈ సందర్భంగా చెబుతారు.
ఇక చూస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా ప్రధాని కావడానికి అంగీకరించదని కూడా అంటున్నారు. బీజేపీని వ్యక్తి పూజ నుంచి తిరిగి బయటకు తెచ్చి సంస్థాగతంగా బలోపేతం చేయాలని సిద్ధాంత పునాదుల మీదనే పార్టీని పునర్ నిర్మించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది అని అంటున్నారు.
ఈ క్రమంలోనే యోగీకే ఆర్ఎస్ఎస్ జై కొడుతుందని ఆయనకే పట్టం కట్టాలని తన డిమాండ్ గా ముందు పెడుతుందని అంటున్నారు. అంటే మోడీ దిగిపోతే కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఈ విషయంలో ఒక అభిప్రాయ భేదం అయితే రావచ్చు అని అంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో కూడా తాను కోరుకున్న వారిని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టే విషయంలో తెలుస్తుందని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ఆర్ ఎస్ ఎస్ మాత్రం భారీ వ్యూహంతోనే ఉందని చెబుతున్నారు. ఊరకే 75 ఏళ్ళకే తప్పుకోవాలని అనలేదని అంటారు. తిరిగి బీజేపీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని తాను అనుకున్న వారే ప్రధాని కావాలన్న సంఘ్ పంతం పట్టుదల ఎంతమేరకు నెగ్గుతుంది అన్నది రానున్న కాలమే తేల్చుతుంది అని అంటున్నారు.