ట్రంప్ తెంపరితనం.. మోడీ మౌనం.. భారత్ కు కలిగే లాభనష్టాల మాటేంటి?
పిచ్చోడి చేతిలో రాయి అన్న మాటకు నిలువెత్తు రూపంగా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాట ఇటీవల కాలంలో పలువురి నోట తరచూ వినిపిస్తోంది.;
పిచ్చోడి చేతిలో రాయి అన్న మాటకు నిలువెత్తు రూపంగా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్న మాట ఇటీవల కాలంలో పలువురి నోట తరచూ వినిపిస్తోంది. మాట్లాడే మాటలో స్థిరత్వం లేకపోవటం.. తన ఆగ్రహాన్ని అదే పనిగా ప్రదర్శించే ట్రంప్ తీరుతో చాలానే దేశాలు అగ్రరాజ్యం పట్ల ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలోనూ అగ్రరాజ్య కర్రపెత్తనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎంత డాలర్ బలం ఉంటే మాత్రం.. ప్రతి దేశాన్ని తన మాటలతో.. టారిఫ్ బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలన్న ట్రంప్ వ్యూహం బెడిసి కొడుతోంది.
గతంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉన్న వారి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఒక్కసారిగా అలెర్టు అయ్యేవారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడి నోటి మాటకు.. సోషల్ మీడియా పోస్టులకు అదే పనిగా ఆగం కావాల్సిన అవసరం లేదన్నట్లుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే.. అమెరికా అగ్రరాజ్య హోదాను ట్రంప్ తన చేతులారా చెడగొడుతున్నట్లుగా చెప్పాలి.
అగ్రరాజ్యానికి ఉండే ఆర్థిక బలిమి నేపథ్యంలో ఆచితూచి అన్నట్లుగా పలు దేశాలు వ్యవహరిస్తున్నాయి. భారతదేశం కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పాలి. భారతదేశం విషయంలో ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అవుతున్నారే తప్పించి.. తొందరపాటును ప్రదర్శించటం లేదు. పాక్ తో యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని మాత్రం ఎంపిక చేసుకున్న వేదికలపైన మాత్రమే రియాక్టు అయ్యారే తప్పించి.. అదే పనిగా నోటికి పని చెబుతున్నది లేదు.
ట్రంప్ బెదిరింపులకు మోడీ మౌనం సరైన మందేనా? ఇది అసలు సరైన వ్యూహమేనా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇలాంటి వేళ అంతర్జాతీయ పరిస్థితులు.. అమెరికాతో భారత్ కు ఉన్న ఆర్థిక సంబంధాలు.. ట్రంప్ హెచ్చరికలు.. మోడీ మౌనం.. ఏది సరైన వ్యూహం అన్న అంశంలోకి వెళితే..ట్రంప్ లాంటి తింగరి అధ్యక్షుడికి మోడీ మౌనమే చక్కటి సమాధానంగా చెప్పాలి. ఒక వ్యక్తి మీ మీద అదే పనిగా నోరుపారేసుకుంటున్నాడనుకోండి. అందులో న్యాయన్యాయాల్ని పక్కన పెడితే.. అదే పనిగా మనం కూడా కౌంటర్ ఇవ్వటం ఒక పద్దతి. ఇందులో దొందూ దొందే అన్నట్లు ఉంటుంది. అందుకు భిన్నంగా మౌనంగా ఉంటే.. నోరు పారేసుకుంటున్న వ్యక్తిపై అంతకంతకూ వ్యతిరేకత పెరగటంతో పాటు.. మౌనంగా భరిస్తున్న వైనం పలువురిని అకట్టుకోవటంతో పాటు.. సానుభూతి వ్యక్తమయ్యేలా చేస్తుంది.
భారత ప్రధాని మోడీ తీరు కూడా ఇలానే ఉంది. ప్రపంచ దేశాల ముందు అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల్ని మోడీ డీల్ చేస్తున్న విధానం సరైనదేనని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి హెచ్చరికకు కౌంటర్ ఇవ్వటం వల్ల సమస్య పెరుగుతుందే తప్పించి తగ్గదు. అదే సమయంలో ట్రంప్ కు కౌంటర్ గా చేసే ప్రతి వ్యాఖ్యకు స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. అది భారత్ కు ఏ మాత్రం క్షేమకరం కాదు. వ్యూహాత్మక మౌనంతో అమెరికాలోని కార్పొరేట్ లాబీలు ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని తీసుకొచ్చే వీలుంది. ఎందుకంటే.. భారత్ కు మించిన భారీ మార్కెట్ అమెరికన్ కంపెనీలకు ఎక్కడ దొరుకుతాయి మరి?
ట్రంప్ మాటలకు అదే పనిగా స్పందించకుండా ఆచితూచి అన్నట్లుగా రియాక్టుఅయ్యే తీరు అంతర్జాతీయ సమాజం ఎదుట స్థిరమైన.. పరిణితిని ప్రదర్శించే దేశమన్న ఇమేజ్ కలుగుతుంది. ట్రంప్ బెదిరింపులు భారత్ ను దారికి తీసుకొచ్చే వ్యూహాలే తప్పించి.. దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపవు. ట్రంప్ లాంటి అధ్యక్షుడితో పేచీ పెట్టుకునే కన్నా.. మౌనంగా ఉండటమే మంచి వ్యూహమవుతుంది. ఈ తరహా మౌనం అమెరికాలోని అంతర్గత లాబీలు భారత్ కు మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు కూడా అదే పనిగా స్పందించే తీరుకు కాస్త భిన్నంగా ఉండే వీలుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ నోటి దూకుడుకు.. మోడీ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం అన్ని విధాలుగా శ్రేయస్కరమని మాత్రం చెప్పక తప్పదు.