భారత్-రష్యా కటీఫ్ చేయడానికి ఆ దేశాన్ని దించిన ట్రంప్
అమెరికాకు రష్యా, చైనాలు కొరకరాని కొయ్యలు. వాటిని కట్టడి చేయడానికి చేయని ప్రయత్నం లేదు.;
ఊరికే ఉండరు మహానుభావులు అని.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను ఎలాగైనా దారికి తేవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అన్ని అస్త్రశస్త్రాలు వాడుతున్నాడు. తాజాగా తమ జిగ్రీ దోస్త్ దేశం ఇజ్రాయెల్ ను రంగంలోకి దింపాడు. ఏకంగా మోడీతో సంధి చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మోడీని సంప్రదిస్తున్నాడు ట్రంప్. మరి మోడీ వంగుతాడా? బెండ్ అవుతాడా? చీ పొమ్మంటాడా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాకు రష్యా, చైనాలు కొరకరాని కొయ్యలు. వాటిని కట్టడి చేయడానికి చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా చైనాకు ఆయిల్ సరఫరా చేస్తున్న వెనుజులా అధ్యక్షుడిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యాకు చెక్ పెట్టడానికి భారత్ పై ఒత్తిడి పెంచుతోంది. భారత్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే భారీగా టారీఫ్ లు విధించారు. మిగిలిన దేశాలతో డీల్ చేసినట్టుగా కాకుండా కొంత వ్యూహాత్మకంగా ఇండియాతో డీల్ చేస్తున్నారు. టారిఫ్ లు విధించి, వాటిపైన చర్చలు జరుపుతూనే వ్యూహాత్మక వైఖరిని ట్రంప్ ప్రదర్శిస్తున్నారు.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ తనకు మోదీ మంచి మిత్రుడని, తాను సంతోషంగా లేనని మోదీకి తెలుసని అన్నారు. అంటే దాని అర్థం మోదీ రష్యాతో చమురు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. చమురు దిగుమతిని ఆపాలి. తద్వారా రష్యాపై ఒత్తిడి పెరుగుతోంది. కేవలం భారత్ చమురు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే రష్యా బెదిరిపోదని, ఇప్పటికే భారత్ కంటే ఎక్కువగా చైనాకు చమురును ఎగుమతి చేస్తోందని నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్ చర్యలు ఏమాత్రం రష్యాను భయపెట్టలేవన్న వాదన ఉంది. అయినప్పటికీ భారత్ పై ఒత్తిడి పెంచి రష్యాతో చమురు ఒప్పందాన్ని ఆపించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. భారత్ మాత్రం ఇప్పటి వరకు ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు.
ట్రంప్ ఒత్తిళ్లకు భారత్ తగ్గకపోవడంతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మధ్యవర్తిత్వంతో భారత్ ను దారికి తెచ్చుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఇటీవల బెంజిమిన్ నెతన్యాహు మోదీకి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇరువురూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారట. ఆ తర్వాత ఇరుదేశాల దైపాక్షిక సంబంధాలపైన, గాజాలో శాంతి గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవంగా నెతన్యాహు గత ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్యలో భారత పర్యటనకు రావాలి . కానీ ఆ సమయంలోనే అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయిల్ వచ్చారు. ఇజ్రాయిల్ కు వచ్చాక మోదీకి ఫోన్ చేశారు. భారత పర్యటన త్వరలో ఉంటుందన్న ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ అనుమతితో మోదీకి ఫోన్ చేశారని చర్చ జరుగుతోంది. ఇందులో రష్యాతో ఆయిల్ కొనుగోలు అంశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ నెతన్యాహు ద్వారా ఈ అంశాన్ని మోదీ దృష్టికి తెచ్చినట్టు ప్రచారం ఉంది. ఎందుకంటే నెతన్యాహు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు. ఇజ్రాయిల్ అమెరికా అండతోనే మనుగడ సాగిస్తోంది. ఇజ్రాయిల్ కు అమెరికా ఎంత చెబితే అంత. యుద్ధం చేయమంటే చేస్తారు. వద్దంటే ఆపుతారు. అంతలా అమెరికాపై ఇజ్రాయిల్ ఆధారపడి ఉంటుంది. అందుకే ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహును ట్రంప్ నమ్ముతారు. నెతన్యాహుకు భారత్ తో ఉన్న సంబంధాల నేపథ్యంలో... రష్యాతో చమురు కొనుగోలు ఆపాలంటూ ట్రంప్ నెతన్యాహు ద్వారా మోదీ దృష్టికి తీసుకొచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
రష్యా, చైనాలను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే. బ్రిక్స్ దేశాలు ఇప్పటికే డాలర్ ప్రస్తావన లేకుండా వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాయి. లోకల్ కరెన్సీ ద్వారా, బ్రిక్స్ రూపొందించే కరెన్సీల ద్వారా వ్యాపారం చేయాలన్నది ప్రధాన నిర్ణయం. ఇప్పటికే రష్యా, చైనాలు పరస్పరం లోకల్ కరెన్సీలతో వ్యాపారం చేస్తున్నాయి. డాలర్ ను పక్కనపెట్టాయి. డాలర్ ఆధిపత్యం తగ్గితే అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది. అందుకే చైనా, రష్యాలపై అమెరికా గురిపెట్టింది. రష్యాను దారికి తెచ్చుకునేందుకు భారత్ పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది.