వైఎస్ హయాంలో తిరుమల ‘రెండు కొండలు’.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి లక్ష్యంగా సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.;

Update: 2026-02-24 11:40 GMT

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి లక్ష్యంగా సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే హిందువులపై దాడి మొదలైందని ఆరోపించారు. 2005లో తిరుమల ఏడు కొండలు కావని, రెండే కొండలు అంటూ జీవో జారీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పటి జీవోలపై తాను రెండేళ్లపాటు ఉద్యమం చేస్తే, వెనక్కి తగ్గారని అసెంబ్లీలో వెల్లడించారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై సభలో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

తిరుమల కేంద్రంగా 2005 నుంచే హిందువులపై దాడి మొదలైందని చంద్రబాబు ఆరోపించారు. అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేస్తూ అప్పటి పంచాయితీరాజ్ కార్యదర్శి శామ్యూల్ ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. ఆయన ఓ క్రిస్టియన్ కావడంతో తిరుమలపై కనీస విశ్వాసం లేని జీవోలు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ వాళ్లు కూడా తలపెట్టనటువంటి దురాలోచనలను వైఎస్ చేశారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏడుకొండల వాడా గోవిందా గోవిందా అంటూ భక్తితో స్మరించుకుంటాం.. అలాంటి ఏడు కొండలను రెండు కొండలు చేస్తారా? అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ నిర్ణయంపై రెండేళ్ల పాటు దేశంలోని హిందువులంతా భగ్గుమన్నారని గుర్తు చేశారు. ఈ అంశంపై తాను పోరాటం చేస్తే తిరిగి ఆరోపణలు చేశారన్నారు. ఫేక్ ప్రచారం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తన పోరాటంతో సమాజం తిరగబడితే వైఎస్ వెనక్కు తగ్గారని చంద్రబాబు వెల్లడించారు. ఉడిపి పేజోవర్ మఠం విశ్వేశ్వర తీర్ధ స్వామీజి డిమాండ్ మేరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారని, విశ్రాంత జస్టిస్ సిద్ధప్ప నేతృత్వంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఓ నివేదిక ఇచ్చిందని ఏడు కొండల వివాదంపై చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఇక తిరుమలతో పాటు తిరుమల విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, దుకాణాలు, ఉద్యోగాల్లో అన్యమతస్తులు ఉన్నారని కూడా ఆ కమిటీ వెల్లడించిందని గుర్తు చేశారు. తిరుమలలో మద్యం, మాంసం విక్రయాలు జరుగుతున్నాయని కూడా కమిటీ తేల్చిందని చెప్పారు. ‘‘స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా ఉన్న క్రైస్తవ మతస్తుడు రోశయ్యను తప్పించాలని కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పద్మావతీ యూనివర్సిటికి వైస్ ఛాన్సలర్ గా ఓ క్రిస్టియన్ ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి నియమించారు. బలవంతపు మతమార్పిడులు జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటాలు చేశాం.’’ అంటూ నాటి ఘటనలను అసెంబ్లీలో గుర్తు చేశారు చంద్రబాబు.

గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలను ఊపేస్తున్న కల్తీ లడ్డూ ప్రసాదంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ చర్చలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలతో సభ పలుమార్లు చప్పట్లో మారు మోగిపోయింది. ఇక చంద్రబాబు కూడా తన సుదీర్ఘ ప్రసంగంలో తిరుమల పరిరక్షణతోపాటు గతంలో చోటుచేసుకున్న అనేక ఘటనలను సభ దృష్టికి తెచ్చారు. సభలో విపక్షం లేకపోవడంతో ప్రభుత్వం వాదనకు ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు. ప్రభుత్వం ఏం చెప్పాలని భావిస్తుందన్న విషయం సూటిగా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించింది. కల్తీ జరిగిందని వైసీపీ ఒక్క మాట అంగీకరిస్తే ఇంతటి చర్చకు అవకాశం ఉండేది కాదని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సివుంది.

Tags:    

Similar News