హెల్మెట్ బ్యాంక్.. మల్కాజిగిరి పోలీసుల వినూత్న ప్రయత్నం

ఎన్ని చెప్పినా.. ఎంతలా మొత్తుకున్నా మారని హైదరాబాద్ మహానగర వాసుల మైండ్ సెట్ మార్చేందుకు వీలుగా మల్కాజిగిరి పోలీసులు వినూత్న ఆలోచన చేశారు.;

Update: 2026-02-24 10:30 GMT

ఎన్ని చెప్పినా.. ఎంతలా మొత్తుకున్నా మారని హైదరాబాద్ మహానగర వాసుల మైండ్ సెట్ మార్చేందుకు వీలుగా మల్కాజిగిరి పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి అన్నప్పటికి.. వారు హెల్మెట్లు ధరించని కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవటం దగ్గర నుంచి తీవ్రంగా గాయపడే పరిస్థితి. ఈ విషయంపై ఎన్ని చెప్పినా.. చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించకుండానే ప్రయాణాల్ని సాగిస్తుంటారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి ఫైన్లు విధించినా మార్పు రాని పరిస్థితి. ఈ సమస్యకు వినూత్న రీతిలో పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు మల్కాజిగిరి పోలీసులు.

టూవీలర్లు నడిపే వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యం గురించి ఎంత ప్రచారం చేసినా పలువురిలో మార్పురావటం లేదు. దీనికి ఫైన్ షాకులు ఇచ్చే కన్నా.. వారిలో మార్పు తెచ్చేందుకు వీలుగా సరికొత్త గాంధీగిరిని షురూ చేశారు. ఇందులో భాగంగా హెల్మెట్ బ్యాంక్ విధానానికి తెర తీశారు. ఈ ప్లాన్ లో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే టూవీలర్ వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటారు. వారికి ఒక హెల్మెట్ ఇస్తారు. వారి ఫోన్ నెంబరు.. ఆడ్రస్.. వాహనం వివరాలు నమోదు చేసుకొని వదిలేస్తారు. ఎలాంటి ఫైన్లు వేయరు.

ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి..పోలీసులు ఇచ్చిన హెల్మెట్ ను తిరిగి పోలీసులకు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో వాహనదారుల చేత హెల్మెట్ కొనిపించేలా ప్లాన్ చేయటం.. వారికి ఫైన్ విధించని కారణంగా వారిలో మార్పు ఖాయంగా వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ విధానాన్ని హైదరాబాద్ మహానగర పరిధిలోని అన్ని కమిషనరేట్లలో యుద్ద ప్రాతిపదికన ప్రారంభిస్తే.. హెల్మెట్ ధరించటం ఒక అలవాటుగా వాహనదారులకు మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News