ముద్రగడ రాజకీయం: వైసీపీకి జై.. పవన్‌కు నై!

తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముద్రగడ కాపు సామాజికవర్గం నేతగా చెలామణి కావడం కరెక్టు కాదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.;

Update: 2026-02-24 12:32 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారశైలి తీవ్ర చర్చకు దారితీస్తోంది. సొంత సామాజిక వర్గ సంక్షేమానికి రాజీ లేని పోరాటం చేసిన ముద్రగడ కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ప్రధానంగా తన సామాజికవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విషయంలో ముద్రగడ అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముద్రగడ కాపు సామాజికవర్గం నేతగా చెలామణి కావడం కరెక్టు కాదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాజకీయాల్లో కాపు సామాజికవర్గ నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఆయన రాజకీయ వ్యవహారశైలి, ప్రకటనలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుకోవడమే కాకుండా, విపక్షం వైసీపీపై ఆయన అమితంగా ప్రేమ ఒలక బోస్తున్నారని కాపుల్లో ఓ వర్గం విమర్శలు చేస్తోందని అంటున్నారు. కాపు నేతగా ఎదిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విషయంలో ముద్రగడ జీర్ణించుకోలేకపోతున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనకు తాజాగా చోటుచేసుకున్న ఉదంతాలను పవన్ అభిమానులు ఎత్తిచూపుతున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం సోమవారం పరామర్శించారు. ఇటీవల అంబటి అరెస్టు కావడం, ఆయన ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో కాపు నేతగా ముద్రగడ పద్మనాభం గుంటూరులోని అంబటి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అంబటి ఇంటిపై దాడిని ఖండించడమే కాకుండా, ఆ దాడికి ఆయన కాపు కులస్తుడు కావడమే కారణమన్నట్లు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోందని అంటున్నారు. అంబటిని మాజీ సీఎం జగన్ కాపు టైగర్ గా వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు పరామర్శ యాత్రలు నిర్వహించడం, తాజాగా ముద్రగడ కూడా వెళ్లడంతో కాపు సామాజికవర్గాన్ని సంఘటితం చేసే ప్రయత్నం జరుగుతుందా? అన్న చర్చ జరుగుతోందని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమికి వెన్నుదన్నుగా నిలిచిన కాపుల మద్దతు తిరిగి పొందే క్రమంలో అంబటి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ వ్యూహాత్మకంగా వాడుకుంటోందని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కాపు నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే గిట్టదని, వారిని అవమానించడం, వేధించడం చేస్తుంటారని ఆరోపించారు. దీనికి మద్దతుగా గతంలో తన ఇంటిపై దాడి జరిగిందని, ఇప్పుడు అంబటి ఇంటిపై దాడి జరిగిందని ఉదహరించారు.

అయితే ముద్రగడ వాదనపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్గం నుంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. అంబటిపై దాడిని ఎత్తిచూపుతున్న ముద్రగడ వైసీపీ హయాంలో పవన్ పై జరిగిన వ్యక్తిగత దాడిపై ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇప్పటికీ పవన్ విషయంలో అవమానకరంగానే వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా, పవన్ వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడేవారని అప్పుడు ముద్రగడ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు చంద్రబాబు కేటాయించగా, జగన్ రద్దు చేశారని అప్పుడు కాపుల ప్రయోజనాల కోసం ముద్రగడ ఎందుకు ఆందోళన చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కాపు సామాజికవర్గంలో ముద్రగడ కంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఇమేజ్ పెరగడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News