సడన్గా కుప్పకూలిన మరో విమానం.. బెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు!

భారత గగనతలంలో వరుస విమాన ప్రమాదాలు సామాన్యులనే కాక అధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నాయి.;

Update: 2026-02-24 10:38 GMT

భారత గగనతలంలో వరుస విమాన ప్రమాదాలు సామాన్యులనే కాక అధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఘటన మరవకముందే, తాజాగా జార్ఖండ్‌లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎంతో మంది ప్రాణాలను కాపాడాల్సిన 'ఎయిర్ అంబులెన్స్' విమానం సాంకేతిక కారణాలతో కుప్పకూలి ఏడుగురిని బలితీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. నిత్యం ప్రయాణించే విమానయాన భద్రతపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాలు ఇలా వున్నాయి.

ఏం జరిగింది? రాడార్ నుంచి అదృశ్యమైన నిమిషాల్లోనే:

ఫిబ్రవరి 23, 2026 సాయంత్రం రాంచీ నుంచి ఢిల్లీకి రోగిని తరలించేందుకు బయలుదేరిన 'రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్'కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 విమానం (VT-AJV) ఒక్కసారిగా గల్లంతైంది. రాత్రి 7 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం, 7:34 గంటలకు కోల్‌కతా ఏటీసీతో చివరిసారిగా మాట్లాడింది. ఆ తర్వాత వారణాసికి ఆగ్నేయ దిశలో ప్రయాణిస్తున్న సమయంలో రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపటికే అది జార్ఖండ్‌లోని చత్రా జిల్లా, కసారియా పంచాయతీ పరిధిలో కుప్పకూలినట్లు వార్తలు రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

ఏడుగురు మృతి.. విషాదంలో వైద్య బృందం:

ఈ ఎయిర్ అంబులెన్స్‌లో ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, రోగి మరియు అటెండెంట్లు కలిపి మొత్తం ఏడుగురు ఉన్నారు. విమానం నేలను బలంగా ఢీకొట్టడంతో ఆ ప్రభావానికి ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక ప్రాణాన్ని కాపాడాలని ఢిల్లీకి తరలిస్తున్న క్రమంలో, మరో ఆరుగురు కూడా మృత్యువాత పడటం అత్యంత విషాదకరం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను వెలికితీసే ప్రక్రియతో పాటు విమానం ఎందుకు కుప్పకూలిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అప్పుచేసిన దక్కని ప్రాణం:

ఇక తన హోటల్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదంలో యజమాని సంజయ్ శరీరం 65 శాతం కాలిపోవడంతో, రాంచీలో పరిస్థితి విషమించింది. ఎలాగైనా ఆయన్ని బతికించుకోవాలని కుటుంబ సభ్యులు ఏకంగా ₹7.5 లక్షలు అప్పు చేసి మరీ ఢిల్లీకి తరలించేందుకు ఈ ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే విధి ఆ కుటుంబాన్ని దారుణంగా వంచించింది. ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఆరాటంతో చేసిన ఆఖరి ప్రయత్నం విఫలమవ్వడమే కాకుండా, విమానం కుప్పకూలి సంజయ్‌తో పాటు మరో ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది.

వరుస ప్రమాదాలు.. ఎయిర్ సేఫ్టీపై ఎన్నో ప్రశ్నలు:

గత కొద్దికాలంగా దేశంలో విమాన మరియు హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. వీవీఐపీల నుంచి సాధారణ పౌరుల వరకు గాలిలో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక విమానాల నిర్వహణలో లోపాలు ఉన్నాయా? లేక పాత విమానాలను ఇంకా వాడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జార్ఖండ్ ప్రమాదానికి సంబంధించి పూర్తి నివేదిక వచ్చాకే అసలు కారణాలు తెలుస్తాయి. ఏదేమైనా, విమానయాన భద్రతపై కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News