తిట్లు.. శాపనార్థాలు.. కోవూరులో పొలిటికల్ రచ్చ! ప్రసన్నకుమార్ రెడ్డి Vs ప్రశాంతిరెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయాలు హీటెక్కాయి. అధికార టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Update: 2026-06-18 09:16 GMT

నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయాలు హీటెక్కాయి. అధికార టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విమర్శించడంపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఎమ్మెల్యే విమర్శలను తిప్పికొట్టే సమయంలో ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించి మరింత కాక రాజేశారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కోవూరు రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రాజకీయ పోరు వాడివేడిగా సాగుతోంది. గతంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన ఇంటిపై దుండగులు దాడి చేసి ఫర్నీచర్, విలువైన వస్తువులు, గృహోపకరణాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో కోవూరులో పాలిటిక్స్ హైవోల్టేజ్ ను తాకాయి. అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇంటి పేరును మార్చేస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేయడంతో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది.

కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయలేదని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విమర్శలపై రియాక్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తమ కోసం కాదని, ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ‘‘సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తట్ట మట్టి కూడా వేయలేదన్న విమర్శలను ఖండిస్తూ రేణిగుంట మెస్ లో తట్టల వ్యాపారం చేశావా? అంటూ ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తాను సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డినా లేక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డినా అన్న విషయం మాజీ ఎమ్మెల్యేకు అనవసరం అంటూ తేల్చిచెప్పారు. ఈ విషయమై ఎన్నికలకు ముందే తాను ప్రజలకు వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఆయనో పిచ్చోడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. ఇకపై తన విషయంలో తప్పుగా మాట్లాడితే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెబుతున్నారు.

Tags:    

Similar News