మళ్లీ 'తమిళతంబీ' అనిపించుకున్న సీఎం విజయ్.. అసెంబ్లీలో వందేమాతరంకు మంగళం!
ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కొదవ లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తమిళనాడు శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఎన్నో ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాల ఆరంభంలో వినిపించే ‘వందేమాతరం’ గీతానికి ఈసారి విజయ్ సర్కార్ సెలవు ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది.
రాష్ట్ర గీతానికే పెద్దపీట.. అసలేం జరిగింది?
సాధారణంగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు వందేమాతరం, రాష్ట్ర గీతమైన 'తమిళ్ తాయి వళ్తు' ఆలపించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి టీవీకే ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. సమావేశాలను కేవలం 'తమిళ్ తాయి వళ్తు' ఆలాపనతో ప్రారంభించి, ముగింపులో జాతీయ గీతమైన 'జనగణమన'తో ముగించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. "జాతీయత అంటే గౌరవమే... కానీ తమిళనాడు అంటే మాకు ఇంకాస్త ఎక్కువ గౌరవం!" అనే కొత్త రాజకీయ సూత్రాన్ని సీఎం విజయ్ ఈ నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది.
సోషల్ మీడియాలో సెటైర్లు.. నెటిజన్ల ప్రశ్నల వర్షం
ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. "వందేమాతరం ఏమైంది విజయ్ అన్నా?" అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. "జాతీయ గీతం జనగణమనకి ఓకే చెప్పారు... మరి జాతీయ గేయం వందేమాతరంకు నో ఎందుకు?" అని మరికొందరు నిలదీస్తున్నారు.
ఇంకొందరైతే "తమిళ్ ఫస్ట్... ఇండియా నెక్స్ట్" అనే ఫార్ములాను విజయ్ గట్టిగా నమ్ముతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. "తమిళ వాసనలు పోనిచ్చుకోని టీవీకే విజయ్.. ఇవే తగ్గించుకుంటే మంచిది" అంటూ నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తమిళ అస్మిత వర్సెస్ జాతీయత
విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 'తమిళ అస్మిత', 'తమిళ భాష', 'తమిళ సంస్కృతి' అనే అంశాలనే తన ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవించడం వేరు.. కానీ జాతీయ చిహ్నాలు, సాంప్రదాయాల విషయంలో మార్పులు చేయడం వేరంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. "జాతీయతను పక్కన పెట్టి ప్రాంతీయతకు మాత్రమే పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసం?" అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. సొంత రాష్ట్ర గీతానికి, భాషకు ప్రాధాన్యం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని.. జాతీయ గీతాన్ని ఎలాగో గౌరవిస్తున్నాం కదా అని ఎదురుదాడికి దిగుతున్నారు.
ఏది ఏమైనా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడులో మరోసారి "తమిళ్ వర్సెస్ నేషనల్" అనే పాత వివాదానికి కొత్త ఊపునిచ్చింది. రాజకీయంగా తమిళతనాన్ని మరింత బలంగా ప్రొజెక్ట్ చేయాలన్న వ్యూహంతోనే విజయ్ ఈ అడుగు వేశారా? లేక అనవసర వివాదానికి ప్రభుత్వం స్వయంగా తలుపులు తెరిచిందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇకపై కేవలం పరిపాలనా అంశంగా కాకుండా తమిళ అస్మిత వర్సెస్ జాతీయత అనే పెద్ద చర్చకు కేంద్రబిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.