మావోయిస్టు దళపతి లొంగుబాటు.. ఇక మిగిలింది గణపతి మాత్రమే!!
మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.;
మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత నాలుగు దశాబ్దాలుగా విప్లవ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ మావోయిస్టు పార్టీ దళపతిగా ఎదిగిన దేవ్ జీ లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమానికి సారథి లేకుండా పోయాడని అంటున్నారు. రెండు రోజుల క్రితమే తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగుబాటు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తిరుపతి లొంగుబాటును చూపుతారని ఊహాగానాలు వ్యాపించాయి. అయితే డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో తిరుపతి లొంగుబాటును అధికారికంగా ప్రకటించారు. తిరుపతితోపాటు మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహులు, బడే చొక్కారావు ఉద్యమాన్ని వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తున్నామని డీజీపీ సమక్షంలో ప్రకటించారు.
మావోయిస్టు అగ్రనేత, పార్టీ దళపతి దేవ్ జీ లొంగుబాటుతో ఉద్యమం పరిసమాప్తమైనట్లేనని భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన మరో 11 మంది మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వారు కూడా త్వరలో లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా తమతో టచ్ లో ఉన్నారని డీజీపీ వెల్లడించారు. దీంతో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయినట్లే చెబుతున్నారు. పార్టీని నడిపే నాయకుడే లొంగిపోవడంతో ఇంకా ఎవరూ లేరనే చెబుతున్నారు. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి ఆచూకీ మాత్రమే తెలియాల్సివుంది. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత అణచివేత పెరిగిపోవడంతో ఆయన విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు నిలువ నీడ లేకుండా చేసింది. ఒకప్పుడు జనతన సర్కార్ నడిపి, అడవుల్లో సమాంతర ప్రభుత్వంగా పాలన సాగించిన మావోయిస్టులు ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి కల్పించింది. మావోయిస్టు కోటగా ప్రచారం జరిగిన దండకారణ్యంలో భద్రతా బలగాలు పాగా వేయడంతో మావోయిస్టులకు సురక్షిత స్థావరమే లేకుండా పోయింది. దీంతో చావడమో, లొంగిపోవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితులను కల్పించింది కేంద్రం. దీంతో పలువురు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోగా, కొందరు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు.
తాజాగా మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ లొంగుబాటుతో ఇక పెద్ద స్థాయి నేతలు ఎవరూ అజ్ఞాతంలో తలదాచుకునే పరిస్థితి లేకపోయిందని వెల్లడైంది. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుస ఎన్ కౌంటర్లు చేస్తూ మావోయిస్టులకు నిలువ నీడ లేకుండా చేస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామరస్యంతో వ్యవహరించి మావోయిస్టులు లొంగిపోయే వాతావరణం కల్పించింది. దీంతో దేశంలో ఎక్కడా లేనట్లు తెలంగాణలో రికార్డు స్థాయిలో లొంగుబాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
గత రెండేళ్లలో తెలంగాణలో 16 మంది ఎస్ఈఎంలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్ లు, 60 మంది పార్టీ సభ్యులు లొంగిపోయారు. మొత్తం తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య చూస్తే 591 మంది వరకు ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్లారెడ్డి, చొక్కారావు, నర్సింహారెడ్డి సైతం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులను సంప్రదించి లొంగిపోయే వాతావరణం కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు. దేవ్ జీ, మల్లారెడ్డిపై రూ.25 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. ఈ మొత్తాన్ని వారికే అప్పగిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.