ట్రెండింగులో రీల్స్ రాజకీయం.. ఇన్‌స్టాలో మోదీ, రాహుల్ హవా!
ఒకప్పుడు రాజకీయాలు అంటే కేవలం క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు, మైకుల ముందు సుదీర్ఘ ప్రసంగాలు మాత్రమే ఉండేవి. నేతల మధ్య వాదోపవాదాలు కూడా పత్రికలు, టీవీ డిబేట్లకే పరిమితమయ్యేవి.
ఒకప్పుడు రాజకీయాలు అంటే కేవలం క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు, మైకుల ముందు సుదీర్ఘ ప్రసంగాలు మాత్రమే ఉండేవి. నేతల మధ్య వాదోపవాదాలు కూడా పత్రికలు, టీవీ డిబేట్లకే పరిమితమయ్యేవి. కానీ, కాలం మారుతున్న కొద్దీ రాజకీయాల్లోనూ సరికొత్త మార్పులు వస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు, ముఖ్యంగా దేశంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న ‘జెన్ జెడ్’ యువతను ఆకట్టుకోవడానికి బడా నేతలు కూడా సోషల్ మీడియాని ఆశ్రయించాల్సివస్తోంది. వీడియో సందేశాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ అభిప్రాయాలను నేరుగా ప్రజలతో పంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
మోదీ, రాహుల్ ఇన్‌స్టా హవా
సోషల్ మీడియాలో యువత ప్రభావంతో ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ వంటివారు కూడా ఇప్పుడు నిత్యం ఈ వేదికపై అందుబాటులో ఉండాల్సివస్తోంది. గతంలో ఈ వేదికలను వాడుకునే విషయంలో కాస్త అటుఇటుగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు తమ దృక్పథం మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరిట యువత సోషల్ మీడియా ద్వారా సంఘటితం కావడం నేతల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కొద్దిరోజులుగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ తోపాటు ఇతర సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. కొన్ని డేటా ఎనలిటిక్స్ సంస్థల నివేదిక ప్రకారం జూలై 20 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టా ఫీడ్స్‌లో ఎంగేజ్‌మెంట్ గణనీయంగా పెరిగిందని సమాచారం.
ప్రధాని మోదీ ఒక్కో పోస్టుకు గతంలో యావరేజ్ ఎంగేజ్‌మెంట్ 1.13 మిలియన్ నుంచి 1.19 మిలియన్ వరకు ఉండగా, జూలై 20 తర్వాత ఇది ఏకంగా 4.63 మిలియన్లకు చేరిందని చెబుతున్నారు. ఇది సుమారు 289.9 శాతం భారీ పెరుగుదల కావడం విశేషం. సెల్ఫీ వీడియోలు, రీల్స్, సరికొత్త శైలిలో ‘హాయ్ ఫ్రెండ్స్’ అంటూ యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సోషల్ మీడియాలో తన దూకుడు పెంచినట్లు చెబుతున్నారు. ఆయన పోస్టుల యావరేజ్ ఎంగేజ్‌మెంట్ గతంలో 1.52 లక్షలు ఉండగా, ప్రస్తుతం అది 4.26 లక్షలకు చేరిందని చెబుతున్నారు. దీనిద్వారా 180.7 శాతం వృద్ధి నమోదయిందని అంటున్నారు. విద్యార్థులతో ముఖాముఖి, 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్స్ వంటి వాటితో ఆయన యువతను ఆకట్టుకుంటున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ 72 వేలు, బీజేపీ అధికారిక హ్యాండిల్ 34 వేలతో తరువాతి స్థానాల్లో నిలిచాయని చెబుతున్నారు. అధికారిక పార్టీ పేజీల కంటే వ్యక్తిగత లీడర్ల అకౌంట్లకే యువత నుంచి అనూహ్య స్పందన వస్తుండటం గమనార్హం.
సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి
నేతల డిజిటల్ మేకోవర్ మారుతున్న కాలానికి తగినట్లుగా రాజకీయ పార్టీలు, నాయకులు తమ పద్ధతులను మార్చుకుంటున్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలతో సరిపెట్టకుండా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోలు, ట్రెండింగ్ ఫార్మాట్ల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్ జెడ్ ఆకర్షణే ధ్యేయంగా సోషల్ మీడియా బాట పడుతున్నారని చెబుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా యువత ఉండటంతో, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ కూడా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా టీమ్‌లను మరింత పటిష్టం చేసుకుంటున్నాయని చెబుతున్నారు. గంభీరమైన రాజకీయ వాతావరణం నుంచి కాస్త సులభంగా, సాధారణ ప్రజలకు, యువతకు అర్థమయ్యేలా క్యాజువల్ వీడియోలు, బిహైండ్-ది-సీన్స్ క్షణాలను పంచుకుంటూ నేతలు సరికొత్త ట్రెండ్‌కు తెరతీశారని అంటున్నారు. మొత్తానికి, రాజకీయ నాయకుల ప్రచార శైలిలో క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ స్క్రీన్ల వరకు వచ్చిన ఈ మార్పులు రానున్న రోజుల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయని భావిస్తున్నారు.