సిక్కోలు పాలిటిక్స్.. ఎవరికి వారేనా..?
రాజకీయంగా కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం(సిక్కోలు)లో వైసీపీ నేతల మధ్య సఖ్యత కనుమ రుగైంది.
రాజకీయంగా కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం(సిక్కోలు)లో వైసీపీ నేతల మధ్య సఖ్యత కనుమరుగైంది. ఎవరికి వారుగా రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇది పార్టీ పరంగా ఇబ్బందికర పరిణామాలకు దారి తీస్తోందన్న అంచనాలు వున్నాయి. దీనిపై తాజాగా వైసీపీ పెద్ద నివేదిక తయారు చేసింది. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న దరిమిలా.. జిల్లాల వారీగా పార్టీ నివేదికలు రెడీ చేసింది. దీనిలో సిక్కోలు చాలా వీక్‌గా ఉందని స్పష్టమైనట్టు నాయకులు చెబుతున్నారు.
వాస్తవానికి శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్ వంటి ఫైర్ బ్రాండ్ నాయకులు, పైకి కనిపించే నాయకులతో పాటు కనిపించని మరింత మంది నాయకులు వైసీపీకి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ హయాంలో ఈ జిల్లాకు స్పీకర్ పోస్టుతో పాటు మంత్రి పదవులు కూడా దక్కాయి. అయితే.. ఆ ఇమేజ్.. వైసీపీకి ఇప్పటి వరకు ప్లస్ కాలేక పోయింది. పైగా రానున్న భవిష్యత్తులోనూ పార్టీ పరిస్థితి మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.
కారణాలు అనేకం..
సిక్కోలు వైసీపీ రాజకీయాలను అనేక కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. జిల్లాస్థాయి ఇంచార్జ్ కి స్థానిక మాజీ మంత్రులు, నాయకులకు పొసగడం లేదు. పైగా స్థానిక ఎన్నికలకు తమకు సంబంధం లేదన్నట్టుగా మాజీ మంత్రులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్న నాయకు లు ఇప్పటికీ తమ వైఖరిని మార్చుకోలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఈ పరిణామాలనే నివేదికలో స్పష్టం చేశారు. అయితే.. ఇవన్నీ టీకప్పులో తుఫాను మాదిరిగా పోతాయని ఒకరిద్దరు నాయకులు చెబుతుండగా.. కాదు.. ఇవి సీరియస్‌గానే పార్టీని ప్రభావితం చేస్తాయని మరికొందరు అంటున్నారు. మరోవైపు.. దాదాపు నేతలు అందరిపైనా వ్యక్తిగత అంశాలకు సంబంధించి కేసులు వేలాడుతున్నాయి. ఇటీవల తమ్మినేని కుటుంబం తృటిలో అరెస్టు నుంచి తప్పించుకుంది. దువ్వాడపై కేసులు వెంటాడుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు కుటుంబంపైనా గనుల కేసు పెండింగులో ఉంది. దీం తో వారంతా బయటకు వచ్చేందుకు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. మరి వైసీపీ పరంగా ఏం చేస్తారన్నది చూడాలి.