ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: బీజేపీపాలిత రాష్ట్రంలో ఫ్రీ-బ‌స్‌.. ఫ‌స్ట్ టైమ్‌!

ఎన్నిక‌ల ప్ర‌భావం పార్టీల‌ను, నాయ‌కుల‌ను ఎంత‌గా అయినా ప్ర‌భావితం చేస్తుంది. దీనికి ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు.

Update: 2026-08-26 10:48 GMT

ఎన్నిక‌ల ప్ర‌భావం పార్టీల‌ను, నాయ‌కుల‌ను ఎంత‌గా అయినా ప్ర‌భావితం చేస్తుంది. దీనికి ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అయితే.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఉచిత ప‌థ‌కాల విష‌యంలో ఆది నుంచి కొంత భీష్మించిన బీజేపీ.. ఇటీవ‌ల కాలంలో కొంత మెత్త‌బ‌డుతూ వ‌స్తోంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీని బుజ్జ‌గింపు రాజ‌కీయాలు చేస్తోంద‌ని.. ఉచితాలు ఇస్తోంద‌ని.. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభానికి గురి చేస్తోంద‌ని క‌మ‌ల నాథులు పెద్ద ఎత్తున ఆరోపించేవారు. అయితే.. రాను రాను బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌డం లేదు. ఢిల్లీ, అస్సాం, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాల్లో ఉచితాల‌తోనే గ‌ట్టెక్కిన విష‌యం గ‌మ‌నార్హం.

తాజాగా బీజేపీకి కంచుకోట వంటి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ కీల‌క‌మైన ఉచిత ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. 60 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్క‌డికైనా.. ఉచితంగా ప్ర‌యాణించేందుకు వీలుగా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. యూపీ ఆర్టీసీ బ‌స్సుల్లో 60 ఏళ్లు నిండిన వారికి ఈ స‌దుపాయం క‌ల్పించేందుకు ఉద్దేశించిన అంశానికి సీఎం యోగి ఆదిత్య‌నాథ్ నేతృత్వంలో ని మంత్రి మండ‌లి ప‌చ్చ‌జెండా ఊపింది. స‌ద‌రు మ‌హిళ‌లు ఆధార్ లేదా ఎల‌క్ష‌న్ ఓట‌ర్ కార్డును చూపిస్తే చాలు రాష్ట్ర వ్యాప్తంగా సాధార‌ణ బ‌స్సుల నుంచి డీల‌క్స్ వ‌ర‌కు అన్నింటిలోనూ ఉచితంగా ప్ర‌యాణించేందుకు అనుమ‌తిస్తారు.

`లోక‌మాత అహ‌ల్యాబాయి మాతృశ‌క్తి యోజ‌న‌` పేరుతో అమ‌లు చేయ‌నున్న ఈ ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఈ నెల 28 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల్లోకి రానుంద‌ని మంత్రి తెలిపారు.. దీనికి సంబంధించి నెల‌కు 23 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయిస్తామ‌న్నారు. త‌ద్వారా రాష్ట్రంలో 60 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన కోటి మందికిపైగా మ‌హిళ‌ల‌కు ల‌బ్ది చేకూర‌నుంద‌ని వివ‌రించారు ఇది ఎన్నిక‌ల హామీ కాక‌పోయినా.. రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితులు.. మ‌హిళ‌ల విష‌యంలో బీజేపీకి ఉన్న నిబద్ధ‌త మేర‌కు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు మినిస్ట‌ర్ ద‌యాశంక‌ర్ తెలిపారు. దీనిని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

మ‌రో మూడు మాసాల్లో..

కాగా.. యూపీలో మ‌రో మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తెర లేవ‌నుంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం కావ‌డం, 400ల‌కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు..వ‌రుస‌గా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో వ‌చ్చే సారి కూడా హ్యాట్రిక్ సాధించేందుకు క‌మ‌ల నాథులు వ్యూహాలు ర‌చిస్తున్నారు. అయితే.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ, జ‌న్‌-జీ ఎఫెక్ట్‌, అయోధ్య విరాళాల చోరీ, మ‌హా కుంభ మేళాలో 30 వేల మంది మృతి చెంద‌డం.. వంటి ప‌లు ఘ‌ట‌న‌లు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ ఇప్ప‌టికే తాము అధికారంలోకి వ‌స్తే.. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News