మరో వందమంది ఎమ్మెల్యేలు....కొత్త అసెంబ్లీ డిజైన్ వెనక !
ఏపీ శాసనసభలో ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో ఉమ్మడి ఏపీని విభజించాక తెలంగాణాకు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏపీకి 175 మంది వచ్చారు.
ఏపీ శాసనసభలో ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో ఉమ్మడి ఏపీని విభజించాక తెలంగాణాకు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏపీకి 175 మంది వచ్చారు. ఆ విధగా 294 మంది ఎమ్మెల్యేలతోనే విభజన జరిగి మూడు ఎన్నికలను ఏపీ చూసింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఏపీకి 225 మంది ఎమ్మెల్యేలు రావాలి. తెలంగాణాకు 154 మంది ఎమ్మెల్యేలు అదనం కావాలి. కానీ అలా జరగలేదు, విభజన జరిగి కూడా పుష్కర కాలం గడచిపోయింది. ఇక 2029 నాటికి అయినా ఏపీ తెలంగాణాకు అదనంగా ఎమ్మెల్యేలు వస్తారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు పెండింగులో ఉంది. అది కనుక పార్లమెంట్ లో ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు పెరుగుతాయి. దాంతో పాటే ఏపీ తెలంగాణాలలో ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయని అంటున్నారు.
ఎక్కువ సీట్లు వస్తాయి :
విభజన చట్టం ప్రకారం అయితే ఏపీకి దక్కేవి అదనంగా యాభై ఎమ్మెల్యే సీట్లు మాత్రమే. అలా కాకుండా డీలిమిటేషన్ బిల్లు ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న సీట్లలో యాభై శాతం కొత్తగా కలసి వస్తాయి. అంటే దాదాపుగా తొంబై నుంచి వంద దాకా ఏపీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీ సీట్లు అయితే నూరు శాతం అదనంగా వస్తాయని అంచనా కడుతున్నారు. దాంతోనే ఇపుడు ఏపీ అసెంబ్లీ కొత్త భవనం డిజైన్ జరుగుతోంది. మరో వంద మంది ఎమ్మెల్యేలు పెరిగినా కూడా ఏపీ అసెంబ్లీ సీటింగ్ కి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తున్నారు
ధీమా అదేనా :
ఎట్టి పరిస్థితుల్లోనూ డీలిమిటేషన్ అన్నది 2029 ఎన్నికల లోపు జరిగి తీరుతుందని టీడీపీ ధీమాగా ఉంది. దానికి కారణం బీజేపీ నాయకత్వం ఈ విషయంలో పట్టుదలగా ఉండడమే అని అంటున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి అయినా డీలిమిటేషన్ బిల్లుని ఆమోదిస్తారు అని అంటున్నారు. దాంతో ఏపీ శాసన సభ కొత్త భవనాలు కూడా కొత్తగా వచ్చిన వారి కోసం ముందే స్వాగతం పలుకుతున్నాయి. డీలిమిటేషన్ ఆశలకు ప్రతిరూపంగా కొత్త అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ చేయడం చూస్తే ఏపీలో తొందరలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో నూతన భవనం కళకళలాడుతుంది అని అంటున్నారు. ఈ క్రమంలో అమరావతిలోని రాజధానిలోని శాసనసభ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో,భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించేందుకు రూపకల్పనపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అద్భుతమైన సెంట్రల్ హాల్ :
ఏపీ కొత్త అసెంబ్లీకి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్స్ అందిస్తోంది. ఇక కొత్త శాసనసభ భవనం పైన ప్రత్యేక టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి చూస్తే అమరావతి రాజధాని మొత్తాన్ని కనిపించేలా రూపకల్పన చేస్తున్నారు. భవిష్యత్‌లో నియోజకవర్గాల డీలిమిటేషన్ వల్ల ఏర్పడే మార్పులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా భవన డిజైన్లను రూపొందిస్తున్నారు. అలా 265 శాసనసభ స్థానాలు 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా కొత్త శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల కోసం వారు శాసనసభను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థ శాసన ప్రక్రియపై అవగాహన కలిగేలా ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా రూపకల్పన జరుగుతోంది. అలాగే గవర్నర్ ప్రసంగించే సందర్భాల్లో శాసనసభ, శాసనమండలి ఉభయ సభల సభ్యులందరూ ఒకే చోట కూర్చునేలా సెంట్రల్ హాల్ ఏర్పాటు చేసే విధంగా డిజైన్ రూపొందిస్తున్నారు.
ఆహ్లాదంగా అద్భుతంగా :
అదే విధంగా నూతన శాసనసభ ప్రాంగణం పూర్తిగా ఆధునిక సౌకర్యాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి పైభాగంలో పచ్చదనంతో కూడిన గార్డెన్ తరహా ప్రాంగణంగా అభివృద్ధి చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అలాగే మంత్రులు, విప్‌లు, కమిటీ చైర్మన్లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవసరమైన మెరుగైన సదుపాయాలు కల్పించేలా శాసనసభ కొత్త భవన రూపకల్పన చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు, పచ్చదనం ఈ అంశాల సమన్వయంతో అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.