ఏకగ్రీవాలు లేకుండా స్థానిక ఎన్నికలు సాధ్యమేనా? జగన్ కండీషన్స్ పై తర్జనభర్జన

ఏకగ్రీవాలు అయ్యే చోట సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులపై చర్యలు ఉంటాయని అధినేత హెచ్చరికలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Update: 2026-08-26 16:30 GMT

త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అంగీకరించేది లేదని, ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులను పోటీకి పెట్టాలని అధినేత జగన్మోహనరెడ్డి ఆదేశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోగలమా? అంటూ వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏకగ్రీవాలను ప్రోత్సహించామని, ఇప్పుడు వద్దంటే ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవాలు అయ్యే చోట సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులపై చర్యలు ఉంటాయని అధినేత హెచ్చరికలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చూపాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి భావిస్తున్నారు. దీంతో ప్రతి చోట పోటీకి సిద్ధం కావాలని కేడర్ ను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. రెండు నెలల క్రితమే పార్టీ అంతర్గత సమావేశంలో స్థానిక ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, తాజాగా రాష్ట్రంలోని ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసి ఫలితాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. ఈ పరిణామంతో వైసీపీ కేడర్ లో ఒక్కసారిగా జోష్ పెరిగిందని అంటున్నారు. అయితే పార్టీ అధికారంలో లేని సమయంలో ఏకగ్రీవాలు జగరకుండా పోరాడటం అంటే చాలా వ్యవప్రయాసలతో కూడిన అంశంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భావిస్తున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న అరెస్టుల వల్ల కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ అంటే కార్యకర్తలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చర్చిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొన్నిచోట్ల జరిగిన ఒప్పందాల ప్రకారం ప్రస్తుతం ఏకగ్రీవాలకు సహకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో కొన్ని పంచాయతీల్లో గ్రామాల అభివృద్ధి కోసం అంతా కలిసి ఏకగ్రీవ ఎన్నికలు చేసుకుంటారని, ఇలాంటి చోట అధికార పార్టీకి కాస్త మొగ్గు చూపుతుంటారని అంటున్నారు. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకగ్రీవాలకు అంగీకరించమంటే కుదరుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి జారీ చేసిన అల్టిమేటం నియోజకవర్గ నేతలలో గుబులు పుట్టిస్తోందని చెబుతున్నారు. అధినేత ఆదేశాలను అమలు చేసే విధంగా చాలా మంది నియోజవర్గాలలో రంగంలోకి దిగారని చెబుతున్నారు. కానీ కొందరు గత రెండేళ్లుగా నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, అడపాదడపా మాత్రమే కార్యకర్తలను కలుస్తుండటం వల్ల ఇప్పుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సివస్తుందోననే టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు కార్యకర్తలను గాలికివదిలేసి ఇప్పుడు తమ సీటు కిందకు నీళ్లు వచ్చాయనే ఆందోళనతో పోటీ చేయమంటే కేడర్ అంగీకరిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా అధినేత జగన్ రెడ్డి ఆదేశాలతో స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో గానీ వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతల్లో మార్పు మాత్రం తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News