పుంగ‌నూరుకే ప‌రిమితం.. పెద్దిరెడ్డి తేల్చాశారు.. !

కానీ.. దీనికి పెద్దిరెడ్డి విముఖ‌త వ్య‌క్తం చేశారు. ఈ సారి తాను పుంగ‌నూరుకే ప‌రిమితం అవుతాన‌ని.. అక్క‌డి వ‌రకే త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ఆయ‌న కోరారు.

Update: 2026-08-26 14:30 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి బాంబు పేల్చారు. వ‌చ్చే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఉమ్మ‌డి చిత్తూరు స‌హా.. సీమ‌లోని అనంత‌పురం జిల్లాను కూడా అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ భావించారు. తాజాగా ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో పెద్దిరెడ్డి అన్న చూస్తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కానీ.. దీనికి పెద్దిరెడ్డి విముఖ‌త వ్య‌క్తం చేశారు. ఈ సారి తాను పుంగ‌నూరుకే ప‌రిమితం అవుతాన‌ని.. అక్క‌డి వ‌రకే త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ఆయ‌న కోరారు.

కార‌ణం ఏంటి..?

పుంగ‌నూరుకే ప‌రిమితం కావ‌డానికి పెద్దిరెడ్డికి రెండు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయి. 1) పార్టీలో త‌న ఇమేజ్ గ‌తంలో మాదిరిగా లేక‌పోవ‌డం. ఇది వాస్త‌వ‌మేన‌ని పార్టీ కూడా చెబుతోంది. గ‌తంలో పెద్దిరెడ్డి హ‌వాకు తిరుగు ఉండేది కాదు. కానీ, పార్టీ ఓట‌మి త‌ర్వాత‌. చిత్తూరులో ప‌రిణామాలు మారిపోయాయి. పెద్దిరెడ్డి వ‌ర్గంలో చాలా మంది త‌ట‌స్థులుగా మారారు. మ‌రికొంద‌రు పార్టీ కూడా మారిపోయారు. దీంతో ఆయ‌న ఒక‌ప్పుడు జిల్లాకు వెళ్తే స్వాగ‌తాలు ప‌లికిన నాయ‌కులు ఇప్పుడు త‌లుపు చాటుకు వెళ్లిపోతున్నారు. ఈ ప్ర‌భావంతో పెద్దిరెడ్డి త‌న బాధ్య‌త‌ల‌ను తానే త‌గ్గించుకున్నారు.

2) కేసులు, వ‌యో సంబంధిత స‌మ‌స్య‌లు: పెద్దిరెడ్డి ఇప్పుడు కేసుల్లో ఉన్న విష‌య తెలిసిందే. గ‌నులు.. అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌, మ‌ద్యం సిండికేట్ ద్వారా అక్ర‌మాలకు పాల్ప‌డిన‌ కేసులు కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీని కుంగ దీస్తున్నాయి. దీనికితోడు 70 ఏళ్లు దాటిపోయిన నేప‌థ్యంలో గ‌తంలో ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఉండ‌లేకపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు పుంగ‌నూరు వ‌ర‌కు చాల‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. వాస్తవానికి గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో సీమ మొత్తంగా పెద్దిరెడ్డి హ‌వా చ‌లాయించారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.

రాచ‌మ‌ల్లు కూడా..

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కూడా.. త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే ప‌రిమితం చేయాల‌ని తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా త‌న‌కు బాధ్య‌త‌లు వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. ఇక‌, మ‌రికొంద‌రు నాయ‌కులు జిల్లాల బాధ్య‌త‌లు చూసుకునేందుకు ముందుకు వ‌చ్చినా.. టికెట్ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన ద‌రిమిలా.. త‌మ విధానాలు, ప‌రిధిలు మార్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏదేమైనా ఈ ప‌రంప‌ర‌లో పెద్దిరెడ్డి ముందుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News