ట్రంప్ తో 30 సెకన్ల మాటల్ని మోడీకి ముప్పావు గంట చెప్పిన పుతిన్?
చైనా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధినేత పుతిన్ మధ్యనున్న స్నేహం ఎంతలా ఉంటుందో స్పష్టంగా కనిపించింది.;
చైనా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా అధినేత పుతిన్ మధ్యనున్న స్నేహం ఎంతలా ఉంటుందో స్పష్టంగా కనిపించింది. ఒకే కారులో వెళ్లిన వీరిద్దరు హోటల్ వద్ద కారులోనే ముప్పావు గంట మాట్లాడటం అందరిని ఆకర్షించింది. సుంకాల షాకులతో భారత్ మీద కత్తి కట్టిన ట్రంప్.. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురును కొనద్దంటూ ఫర్మానా జారీ చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా భారత్ తన దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేసింది. దీంతో 50 శాతం సుంకాల షాక్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
ఇలాంటివేళ మోడీ -పుతిన్ భేటీ అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో చైనాలో ఆ దేశ అధ్యక్షుడితోనూ మోడీ భేటీ కావటం.. ఇరువురి మధ్య సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మోడీ తిరిగి వచ్చేసిన తర్వాత కూడా పుతిన్ చైనాలోనే ఉండటం.. ఆ దేశం ప్రదర్శించిన అత్యాధునిక ఆయుద షోను తిలకించటం తెలిసిందే. ఈ సందర్భంగా చైనాలోని మీడియాతో పుతిన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీతో తాను కలిసి కారులో మాట్లాడుకున్న విషయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు ముప్పాతిక గంట పాటు ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకోవటం తెలిసిందే. ఇదే అంశాన్ని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు పుతిన్ స్పందిస్తూ.. ‘‘అదేం పెద్ద రహస్యం కాదు. అలాస్కాలో ట్రంప్ తో జరిగిన చర్చల గురించి మోడీకి వివరించా. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే అంశంపై చర్చించేటప్పుడు కారులో మాట్లాడుకున్నాం. ట్రంప్ తో 30 సెకన్లే మాట్లాడా. ఆయన ఆరోగ్యంగా ఉండటం చూసి సంతోషంగా అనిపించింది’ అంటూ పుతిన్ పేర్కొన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ట్రంప్ తో ముప్ఫై సెకన్లు మాట్లాడిన మాటల్ని మోడీకి ముప్పాతిక గంట పాటు వివరించటం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. ట్రంప్ తీరును బలంగా వ్యతిరేకిస్తున్న పుతిన్.. తాజాగా భారత్ చైనాలను మందలించిన అంశంపై సీరియస్ అయ్యారు. ట్రంప్ తన తీరును మార్చుకోవాలని పేర్కొన్నారు. మొత్తంగా చైనాలో పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి.