మూడు గంటలకే పరిమితం చేయడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే
ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు మణిపూర్ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఈ నెల 13న ఢిల్లీ నుంచి నేరుగా మణిపూర్ రాజధాని ఇంపాల్ చేరుకుంటారు.;
ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు మణిపూర్ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఈ నెల 13న ఢిల్లీ నుంచి నేరుగా మణిపూర్ రాజధాని ఇంపాల్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన అధికారిక పర్యటన సాగుతుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోడీ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన మూడు గంటల పాటు సాగుతోంది. అయితే దీని మీద విపక్ష కాంగ్రెస్ అయితే మండిపడుతోంది.
రావణకాష్టంగా మణిపూర్ :
మణిపూర్ అని మంచి పేరు ఉంది. నిజంగా ఈశాన్య రాష్ట్రాలలో మణిపూస గా ఉండాల్సిన రాష్ట్రం గత 29 నెలలుగా అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ లో పరిస్థితులు ఒక దశలో అధ్వాన్నంగా కూడా మారాయి. ఇదంతా 2023 మొదట్లో చోటు చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇలా రెండున్నరేళ్లుగా మణిపూర్ మండుతున్నా ప్రధాని మోడీ అక్కడ ఎందుకు పర్యటించలేదని విపక్ష కాంగ్రెస్ ఎన్నో సార్లు నిలదీసింది. తాజాగా మోడీ మణిపూర్ టూర్ నేపథ్యంలో కాంగ్రెస్ విమర్శల జోరు పెంచింది.
ప్రజలను అవమానించడమే :
నరేంద్ర మోడీ ఏళ్ల తరబడి ఆ రాష్ట్రానికి వెళ్లకపోగా తాజాగా టూర్ పెట్టుకుని మూడు గంటలకే పరిమితం చేయడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. మోదీ మణిపుర్లో కేవలం మూడు గంటలు మాత్రమే పర్యటించడేంటని నిలదీశారు. ఇది అత్యంత వేగంగా ఒక ప్రధాని చేస్తున్న ప్రయాణం గా అభివర్ణించారు. ఇంత తక్కువ వ్యవధిలో పర్యటన చేయడం ద్వారా ఆయన ఏమి సాధిస్తారో అర్థం కావడం లేదని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
రాహుల్ సెటైర్లు :
మరో వైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోడీ మణిపూర్ పర్యటన మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇంతకాలానికి మణిపూర్ కి ప్రధాని వెళ్ళాలనుకోవడం స్వాగతించతగినదే అని వ్యాఖ్యానించారు. అయితే ఇపుడు దేశంలో ప్రధాన సమస్యగా ఓటు చోరీ అంశం ఉందని అన్నారు. ఆ విషయం మీద స్పందించాలని అన్నారు. హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేదలు బడుగుల ఓట్లు పోయాయని కూడా రాహుల్ ఆరోపించారు.
ఇదీ షెడ్యూల్ :
నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాలలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మణిపూర్ కి మొదట వెళ్తున్నారు. ఆయన ఈ నెల 13 నుంచి 15 దాకా మిజోరాం, మణిపుర్, అసోం, పశ్చిమ బంగాల్, బిహార్ రాష్ట్రాలలో పర్యటిస్తారు. ఇక మణిపూర్ లో 12 వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే మొత్తం 7వేల 3 వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పీస్‌గ్రౌండ్‌లో మణిపుర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నరేంద్ర ప్రసంగిస్తారు. మణిపూర్ కి దాదాపుగా రెండున్నరేళ్ళ తరువాత వెళ్తున్న మోడీ అక్కడ నుంచి ఏమి మాట్లాడుతారు ఏ రకమైన సందేశాన్ని ఇస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.