ఉపరాష్ట్ర ఎన్నిక.. చంద్రబాబు కీ రోల్ ఇదే.. !
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం తెర మీదకు వచ్చింది. జగదీప్ ధన్‌ఖడ్ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది;
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం తెర మీదకు వచ్చింది. జగదీప్ ధన్‌ఖడ్ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవికి ఎవరైనా రాజీనామా చేసినా.. లేదా పదవీ విరమణ జరగడానికి ముందు 60 రోజుల సమయంలో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది సంప్రదాయం. ఇప్పుడు అనూహ్యంగా జగదీప్ రాజీనామా చేయడంతో 60 రోజులు పాటు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సమయం ఉంటుంది.
కానీ ఈ దఫా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం 30 రోజుల్లోనే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు.. ఏ విధంగా ముందుకు వెళ్తారు.. అనేది జాతీయ మీడియాలో చర్చకు దారితీసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో మంత్రివర్గ ఎంపిక సమయంలోను, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులోనూ చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎందుకంటే టీడీపీ మద్దతు మోడీ ప్రభుత్వానికి అత్యంత కీలకం. వచ్చే ఎన్నికలకు ఎలా ఉన్నా.. గత ఎన్నికల్లో బిజెపి 240 స్థానాలకే పరిమితం కావడంతో ఏపీలోని టిడిపి, బీహార్ లోని జెడియు పార్టీలు మోడీకి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఆయన ఈ రెండు పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అత్యంత కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన అభిప్రాయాలు ఆయన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఒకవేళ చంద్రబాబు తనకు నచ్చిన వారి పేరును సూచించినా.. కేంద్రం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని దాని ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు కేంద్రం నుంచి చంద్రబాబుకు ఈ తరహా సూచనలు కాని ఈ తరహా సలహాలు ఇవ్వమని ఎటువంటి సంకేతాలు పంపించకపోవడం... అదేవిధంగా తనంతట తామే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ విషయాన్ని చంద్రబాబు లైట్ తీసుకున్నా.. ఏపీలోని ప్రత్యర్థి పక్షాల నుంచి మాత్రం ఆయనకు విమర్శలు తప్పేలా లేవు. కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబును కనీసం సంప్రదించకుండానే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేశారు.. అన్న వాదన చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. పైగా ఉపరాష్ట్రపతి పదవి కావడం.. అందులో టిడిపి ఎంపీలు కూడా ఓటు వేయాల్సి రావడంతో మరింతగా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.
దీనిని బట్టి బిజెపి విషయంలోను, ఉపరాష్ట్రపతి ఎంపిక, ఎన్నిక విషయంలోనూ చంద్రబాబు వ్యూహాత్మకం గా వ్యవహరించి తన ప్రాధాన్యాన్ని కూడా చెప్పుకునేలాగా తన సూచనలు చేసేలాగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే విమర్శలు రావడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.