జీఎస్టీ రిఫార్మ్స్: సిగరెట్ 70.. అగ్గిపెట్టె అర్ధరూపాయి!
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)లో మార్పులు తీసుకువస్తామని, పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారాలు తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే;
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)లో మార్పులు తీసుకువస్తామని, పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారాలు తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోటపై నుంచి ఆయన ఈ ప్రకటన చేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఒక లెక్క-ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా జీఎస్టీ ఉంటుందని కూడా ప్రధాని వెల్లడించారు. అన్నట్టుగానే మరుసటి రోజే వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని వేశారు.
జీఎస్టీలో సంస్కరణలను ప్రతిపాదించాలని ఈ కమిటీకి సూచించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఏయే అంశాల్లో సంస్కరణలు తీసుకురావాలి.. ఏయే అంశాల్లో వెసులుబాట్లు కల్పించాలనే విషయంపై కేంద్రం ముందుగానే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దానినే ఈ కమిటీకి అప్పగించింది. అంటే.. ముందుగానే లక్ష్మణ రేఖలు గీశారన్న మాట. దీని ప్రకారమే .. తాజాగా బీహార్ మంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో భేటీ అయిన.. జీఎస్టీ సంస్కరణల కమిటీ పలు ప్రతిపాదనలు రెడీ చేసింది. వీటిని కేంద్రం యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది.
ఇవీ.. నిర్ణయాలు..
+ ఈ సంస్కరణల ప్రకారం.. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, చుట్టలు, ఇతర ఖైనీ, గుట్కా, తంబాకు సహా.. అన్ని రకాల వస్తువులపై 40 శాతం జీఎస్టీని విధిస్తారు. ఉదాహరణకు సిగరెట్ ధరలు అమాంతం పెరగనున్నాయి. ఒక క్వాలిటీ సిగరెట్ 70 రూపాయలు ఉంటే.. అగ్గిపెట్టె మాత్రం 50 పైసలకే లభించనుంది.(ప్రస్తుతం అగ్గిపెట్టె రూ.1గా ఉంది)
+ అలానే.. ప్రజలు విరివిగా ఉపయోగించే అగ్గిపెట్టెలు ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. వీటిని 5 శాతానికి తగ్గిస్తారు.
+ అదేవిధంగా జీఎస్టీలో ప్రస్తుతం నాలుగు రకాల శ్లాబులు ఉన్నాయి. 5, 12, 18, 28 శాతాల చొప్పున పన్నులు విధిస్తున్నారు. వీటిలో తాజాగా ఇక నుంచి రెండు శ్లాబులనే ప్రతిపాదిస్తారు. 5 శాతం, గరిష్ఠంగా 18 శాతానికే జీఎస్టీని పరిమితం చేయనున్నారు.
+ ఇక, పన్నులు విధించే వస్తువులను నాలుగు రకాలుగా విభజించారు. అతి సాధారణ, సాధారణ వస్తువులుగా పేర్కొన్నారు. వీటిపై 5 శాతం పన్నులు విధిస్తారు, అల్ట్రా లగ్జరీ, లగ్జరీ అంటూ.. మరో రెండు రకాల వస్తువులను పేర్కొన్నారు. వీటికి కామన్‌గా 18 శాతం పన్ను రేటును వర్తింప చేస్తారు.
+ మరో కీలక ప్రతిపాదన 40 శాతం పన్ను. ఇది హానికర వస్తువులపైనా.. ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని భావించే వస్తువులపైనా విధిస్తారు. మొత్తంగా ఇదీ.. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన కీలక ప్రతిపాదన. దీనిని కేంద్రం ఆమోదించి.. ఈ దీపావళికి ముందుగానే.. అమల్లోకి తీసుకువచ్చేందుకు రెడీ కానుంది.