తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

Update: 2024-01-04 14:35 GMT

తెలంగాణలో కొద్ది రోజుల క్రితం శాసన సభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారక ముందే ఇంకో మూడు నెలల్లో జరగబోతోన్న లోక్ సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. వీలైనన్ని లోక్ సభ స్థానాలు దక్కించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పరాభవం నుంచి బయట పడాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది.

ఇక, తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో జరగబోతోన్న ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో, అక్కడ ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 18న నామినేషన్ల గడువు ముగుస్తుంది. జనవరి 19న నామినేషన్ల పరిశీలన, జనవరి 22న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. జనవరి 29 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 1న ఫలితాలు రాబోతున్నాయి.

Tags:    

Similar News