ఓడించిన ప్రజల వద్దకు స్టాలిన్
ఆయనకు ఉన్న అనుభవానికి ఏనాడో ముఖ్యమంత్రి కావాలి. కానీ కరుణానిధి పట్ల గౌరవంతో ఆయన ఉన్నంతవరకూ పక్కనే ఉండిపోయారు.;
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ది ఆషామాషీ రాజకీయ జీవితం కాదు, ఇందిరాగాంధీ కాలం నుంచి రాజకీయాలను చూసిన దిగ్గజ నాయకుడు ఆయన 1975 ఎమర్జెన్సీ టైంలో దానికి వ్యతిరేకంగా యువజన నాయకుడిగా చెన్నైలో నిరసనలు నిర్వహించడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన స్టాలిన్ ఆ తరువాత అదే దూకుడు కొనసాగించారు. ఆయనకు ఉన్న అనుభవానికి ఏనాడో ముఖ్యమంత్రి కావాలి. కానీ కరుణానిధి పట్ల గౌరవంతో ఆయన ఉన్నంతవరకూ పక్కనే ఉండిపోయారు.
నైతికతకు కట్టుబడి :
ఇక మరో గోల్డెన్ చాన్స్ ఆయనకు 2016 తరువాత వచ్చింది. అన్నా డీఎంకేకి పెద్ద దిక్కు జనాకర్షణ కలిగిన నాయకురాలు జయలలిత ఆ ఏడాది డిసెంబర్ లో మరణించారు. ఆమె రెండవసారి సీఎం అయి ఆరు నెలలు కాకుండానే ఇలా కనుమరుగు అయ్యారు. చేతిలో ఇంకా నాలుగునరేళ్ల పాలన ఉంది. అన్నా డీఎంకేలో నాయకత్వ సంక్షోభం ఉంది. ప్రతిపక్షంలో డీఎంకే బలంగా ఉంది. చాలా మంది ఈ వైపునకు వస్తామని కూడా అన్నారు. కానీ స్టాలిన్ కాదు అనుకున్నారు, ఫిరాయింపులు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయమని స్పష్టంగా చెప్పేశారు. ప్రజలలోనే ఉంటూ ప్రజా తీర్పు ద్వారానే సీఎం అవుతాను అని చెప్పడంతో అన్నా డీఎంకే లీడర్లు ఊపిరి పీల్చుకున్నారు. అలా బీజేపీ మద్దతుతో మొదట పన్నీరు సెల్వం ఆ తరువాత పళని స్వామి ముఖ్యమంత్రులుగా ఉంటూ అయిదేళ్ళ పాటు నెట్టుకుని వచ్చారు. 2021 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే స్టాలిన్ విజయ దుందుభి మోగించి జనామోదంతో సీఎం అయ్యారు. అప్పటికి ఆయనకు 70 ఏళ్ళు దాటాయి.
అంతా బాగుందనుకుంటే :
ఇక అంతా బాగుందని సర్వేలు సైతం అదే చెబుతున్నాయని స్టాలిన్ ధీమా పడ్డారు. కానీ చివరికి జరిగింది వేరు. తనను ఓడించేటంత బలం అన్నా డీఎంకేకి లేదని ఆయన కరెక్ట్ గానే అంచనా వేశారు. కానీ విజయ్ విషయంలోనే ఆయన ఏ లెక్కలూ వేయలేదు. దాంతో ఆ వైపు నుంచే ముప్పు ముంచుకొచ్చింది. ఫలితం సీఎం సీటు చేజారింది. అంతే కాదు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీటు కూడా పోయి మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. ఇది ఇంకా బాధాకరమైన విషయంగా ఉంది.
రోజు తిరక్కుండానే :
అయితే ఎమ్మెల్యేగా ఓడి ఒక్క రోజు కూడా తిరక్కుండానే తనను ఓడించిన కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల చెంతకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రావడం విశేషం. వారికి అభివాదం చేస్తూ ఆయన రోడ్డు షో నిర్వహించడం రాజకీయంగా సంచలనం రేకెత్తించే పరిణామంగా మారింది. ఈ ఓటమిని నిజానికి స్టాలిన్ అసలు ఊహించలేదు. తప్పకుండా మరోసారి ముఖ్యమంత్రి తాను అవుతాను అని ఆయన భావించారు. సర్వేలన్నీ అదే విషయనని ఘోషించాయి. అంతే కాదు త్రిముఖ పోటీలో డిఎంకె సేఫ్ జోన్ లో ఉంటుందని సీట్లు తక్కువ అయినా మరో మారు అధికారం అందుకుంటుందని రాజకీయ విశ్లేషకులూ భావించారు.
అందరికీ జరిగింది కానీ :
ఈ రాజకీయ మ్యాజిక్ అందరికీ జరిగింది కానీ స్టాలిన్ బాడ్ లక్ ఆయనకే ఎదురు తిరిగింది. నిజానికి చూస్తే త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు దారుణంగా చీలిపోవాలి. ఎందుకంటే మూడు పార్టీలు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను రెండు ప్రతిపక్షాలు పంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అధికారపక్షం మరోసారి అధికారంలోకి వస్తుంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరిగింది. ఆనాడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం కూటమి కట్టింది. మరోవైపు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించి ప్రజల వద్దకు వెళ్లారు. ఇంకో వైపు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తన పార్టీతో రంగంలో దిగారు. ఇలా విపక్షం వేరుగా పోటీ చేసి అధికారి వ్యతిరేక ఓట్లు భారీగా చీల్చింది. దాంతో తక్కువ సీట్లతో ఉమ్మడి ఏపీలో వైయస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ తమిళనాడులో మాత్రం స్టాలిన్ కి ఈ ఓట్ల చీలిక మ్యాజిక్ పనిచేయలేదు.
భారీ షాక్ తోనే :
ఇవన్నీ పక్కన పెడితే స్టాలిన్ ముఖ్యమంత్రిగా తన పార్టీని విజయ పధాన నడిపించలేకపోయారు. అదే సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొళత్తూరు స్థానం కూడా గెలుచుకోలేక పోయారు. ఒక విధంగా ఆయన రాజకీయ జీవితంలో ఇది కోలుకోలేని దెబ్బ. ముఖ్యమంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఓడిపోవడం స్టాలిన్ కి రాజకీయంగా భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఇంతటి బాధ నుంచి ఆయన కోలుకొని కేవలం 24 గంటల వ్యవధిలోనే జనంలోకి రావడం విశేషం. అది కూడా తాను పోటీ చేసిన చోట తను జనాలు ఓడించిన నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. రెండు చేతులు జోడించి ఓపెన్ టాప్ వాహనంలో ఆయన జనానికి వివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.పోయిన చోటే వెతుక్కోవాలి అన్న రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అతి తక్కువ సమయంలో జనంలోకి స్టాలిన్ రావడం విశేషం. ఒక స్టాలిన్ ని జనాలు కూడా బాగానే వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఆయన కూడా ఒక్క మాటలు మాట్లాడకుండా జనాలకు రెండు చేతులు పెట్టి దండం పెడుతూ ముందుకు సాగిపోవడం చాలా మందిలో ఆలోచనలు పడేసింది.
సానుభూతిని పెంచేలా :
ఐదేళ్లు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఓవర్ నైట్ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు స్టాలిన్. అయితే తనను ఓడించిన ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగడం చాలామందిలో సానుభూతి కూడా పెంచేలా చేసింది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఇవన్నీ సహజం, మళ్లీ ఐదేళ్ల సమయానికి డీఎంకే పుంజుకొని అధికారులకు వస్తుందని పార్టీ ఎమ్మెల్యేలు సమావేశంలో స్టాలిన్ చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనలో నిబ్బరం ఏ మాత్రం సడలిపోలేదని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి.