మద్యం కేసులో బిగ్ ట్విస్టు... ఎంపీ మిథున్ రెడ్డికి బెయిలు

ఏపీ మద్యం స్కాంలో ఏ5 వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ మంజూరైంది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.;

Update: 2025-09-29 09:52 GMT

ఏపీ మద్యం స్కాంలో ఏ5 వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ మంజూరైంది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎంపీకి బెయిలు దక్కడంతో ఊరట లభించినట్లైంది. ఈ ఏడాది జులై 21న మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. మధ్యలో ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిలు ద్వారా బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మొత్తం 71 రోజులు జైలులో ఉండాల్సివచ్చింది.

మద్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చాక వారంలో రెండు సార్లు విచారణకు హాజరుకావాల్సివుంటుందని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా బెయిలు కోసం రెండు ష్యూరిటీలు సమర్పించాలని తీర్పునిచ్చింది. మద్యం కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేయగా, ఇంతకు ముందు ముగ్గురికి డిపాల్ట్ బెయిలు మంజూరైంది. తాజాగా మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. అయితే మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని సిట్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల మేర మద్యం స్కాం చేశారని మిథున్ రెడ్డితోపాటు మిగిలిన నిందితులపై సిట్ అభియోగాలు నమోదైంది. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా, 12 మందిని అరెస్టు చేశారు. ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఏ4 మిథున్ రెడ్డితోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులుగా చెబుతున్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, రిటైర్డ్ ఆర్డీవో క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ చార్టడ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు అయిన వారిలో ఉన్నారు. వీరిలో కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, చెవిరెడ్డికి ఇంకా బెయిలు లభించలేదు. ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, క్రిష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికే డిఫాల్ట్ బెయిలు దక్కింది.

తాజాగా మిథున్ రెడ్డికి బెయిలు దక్కడంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సమాంతర దర్యాప్తు ప్రారంభించగా, ఈడీ అరెస్టులు చేసే అవకాశాలపై నిందితులు భయపడుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏసీబీ కోర్టు బెయిలు ఇస్తూ ఊరట కల్పించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మిథున్ రెడ్డికి బెయిలు లభించడంతో త్వరలో మిగిలిన నిందితులు జైలు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News