అందం, ఆతిథ్యం, వివాదం.. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల వెనుక రాజకీయం
హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ పోటీల మధ్యలో అనూహ్యంగా ఓ పెద్ద వివాదం చెలరేగింది.;
హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ పోటీల మధ్యలో అనూహ్యంగా ఓ పెద్ద వివాదం చెలరేగింది. అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా పోటీల నుంచి వైదొలిగి లండన్ వెళ్లిన మిస్ ఇంగ్లాండ్ మిలా మాగీ, అక్కడ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ తెలంగాణలో దీనిపై రాజకీయం కూడా మొదలైంది. అయితే, నిజానిజాలు తెలియకుండా చేసే ఆరోపణలు, నిర్ధారణలు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకే మాయని మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచంలోని దాదాపు ప్రతి చిన్న దేశం నుంచి కూడా పోటీదారులు పాల్గొంటున్నారు. వారందరూ తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఆతిథ్యం పట్ల, పోటీల నిర్వహణ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, మిస్ ఇంగ్లాండ్‌కు ఏం నచ్చలేదో తెలియదు కానీ, ఆమె పోటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఆశ్చర్యకరంగా, ఆమె వెళ్లేముందు నిర్వాహకులపై ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఏ విషయంలోనూ తప్పులు వెదకలేదు, సంతోషంగానే వెళ్లినట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్‌ను పోటీలకు ఆహ్వానించారు కూడా. కానీ లండన్ వెళ్లిపోయిన తర్వాత మిలా మాగీ మీడియా ముందు చేసిన ఆరోపణలు అందరినీ, ముఖ్యంగా నిర్వాహకులను కూడా ఆశ్చర్యపరిచాయి.
మిస్ వరల్డ్ పోటీలు అంటేనే అది ఒక ప్రత్యేక ప్రపంచం. ఇది సాధారణ ప్రజలకు పెద్దగా సంబంధం లేని ఒక హై-ప్రొఫైల్ కార్యక్రమం. ఇక్కడ పార్టీలు, విందులు అనేవి చాలా సహజం. తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలకు కొంత ఖర్చు చేసి ఆతిథ్యం ఇస్తున్నందున, దాని ద్వారా రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని భావించింది. అందుకే పోటీదారులను వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రచారం చేయించింది. ఈ విషయంలో వచ్చిన విమర్శలు ఏమైనా ఉంటే, అవి తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు మీదనే. కాంగ్రెస్ పార్టీ రూ.20 కోట్లు ఖర్చయిందని అంటుంటే, బీఆర్‌ఎస్ పార్టీ రూ.200 కోట్లు అని ఆరోపిస్తోంది. ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైంది.
మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. నిజానిజాలు ఇంకా బయటకు రాకముందే, కొంతమంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ద్వేషంతో ఏదో జరిగిపోయింది అన్నట్లుగా ప్రచారం ప్రారంభించారు. సంబంధం లేని ఫోటోలను పెట్టి ఇక్కడే ఏదో జరిగిందని విశ్లేషించడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకే మాయని మచ్చ పడుతుంది. ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ చేసినవి చిన్న ఆరోపణలు కావు. అవి మహిళల వ్యక్తిత్వంపై నింద వేసే తీవ్రమైన ఆరోపణలు. అలాంటివి నిజంగా జరిగాయని ప్రచారం చేస్తే, తెలంగాణ రాష్ట్రం కల్పించిన ఆతిథ్యానికి, దాని సంస్కృతికి కళంకం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంపైనే ఒక చెడు ముద్ర పడుతుంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రచారం చేయడం మంచిది కాదని, అది చివరికి రాష్ట్రానికే నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజాలు వెలుగులోకి వచ్చే వరకు సంయమనం పాటించడం మంచిది.