మిస్ వరల్డ్ ఫైనల్ లో సీఎం మాట్లాడలేదు.. ఆయన సతీమణికి ఛాన్స్

రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఏమైనా కావొచ్చు. సదరు ప్రోగ్రాంకు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటే ఆయనకు పెద్దపీట వేస్తుంటారు.;

Update: 2025-06-01 12:20 GMT

రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఏమైనా కావొచ్చు. సదరు ప్రోగ్రాంకు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటే ఆయనకు పెద్దపీట వేస్తుంటారు. ఆయన ప్రసంగానికి అంతో ఇంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకు భిన్నమైన సీన్ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల సందర్భంగా చోటు చేసుకుంది. అంతేకాదు.. రోటీన్ కు భిన్నంగా.. ఆ మాటకు వస్తే ఒక రేర్ సీన్ ఆవిష్క్రతమైందని చెప్పాలి. ఇంతకూ ఆ అంశం ఏమంటే..

హైటెక్ సిటీలోని హైటెక్స్ వేదిక మిస్ వరల్డ్ 72వ పోటీలకు సంబంధించి ఫైనల్ వేదికగా మారిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి 9.30 గంటల మధ్య వరకు జరిగిన ఫైనల్ లో థాయ్ లాండ్ కు చెందిన పోటీదారు టైటిల్ ను సొంతం చేసుకోవటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చాలా తక్కువ మంది గుర్తించిన అంశం ఏమంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైనా.. చిరునవ్వులు చిందిస్తూ కూర్చోవటం.. విజేతల్ని అభినందించటం మినహా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడింది లేదు.

మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభోత్సవ వేడుకల్ని గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనూ ఆయనకు మాట్లాడే ఛాన్స్ దక్కలేదు. మిస్ వరల్డ్ 72 ఎడిషన్ పోటీలు ప్రారంభం అంటూ సింగిల్ లైన్ లో ముగించేశారు. గ్రాండ్ ఫైనల్ సందర్భంగా ఆ మాత్రం మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఆయనకు బదులుగా సీఎం రేవంత్ సతీమణికి మాత్రం.. కార్యక్రమం ముగిసిన తర్వాత మిస్ వరల్డ్ 72 ఎడిషన్ పోటీలు ముగిశాయి అన్న సింగిల్ లైన్ మాట మాట్లాడారు. ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడని అరుదైన సందర్భం ఒక ఎత్తు అయితే.. ఆయనకు బదులుగా ఆయన సతీమణి సింగిల్ లైన్ లో తన స్పీచ్ ను కంప్లీట్ చేయటం విశేషంగా చెప్పకతప్పదు.

Tags:    

Similar News