హైదరాబాద్ కు తరలివస్తున్న అందగత్తెలు!

మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలను సుందరీకరించి, రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు.;

Update: 2025-05-08 03:44 GMT

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సుందరీమణులు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు.

 

ఇప్పటివరకు సుమారు 65 మంది అందగత్తెలు హైదరాబాద్ అడుగుపెట్టారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు, స్థానిక కళాకారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలుకుతున్నారు. బుధవారం ఒక్కరోజే మిస్ లాట్వియా, మిస్ కజకిస్తాన్, మిస్ సింగపూర్, మిస్ డెన్ మార్క్, మిస్ మంగోలియా, మిస్ నికరాగ్వా వంటి పలు దేశాల పోటీదారులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

 

పోటీదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో విమానాశ్రయంతో పాటు, పోటీదారుల ప్రయాణించే మార్గాల్లోనూ భద్రతను పటిష్టం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే, పోటీదారులను తరలించే వాహనాల డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు.

మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలను సుందరీకరించి, రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో 120కి పైగా దేశాల నుంచి అందగత్తెలు పోటీ పడుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని సుమారు 150 దేశాల్లో ప్రసారం చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలు 2025 ఈనెల 10న ప్రారంభమై తుది పోటీలు ఈ నెల 31న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్ ప్రపంచ పటంలో మరోసారి తన స్థానాన్ని చాటుకుంటోంది.

Tags:    

Similar News