ప్రపంచ సుందరి పోటీలు : వివాదాస్పదులకు చెక్.. విజ్ఞప్తులతో ముగింపు
ఎన్నో అంచనాలతో, కొంత వివాదాలతో ప్రారంభమైన ప్రపంచ సుందరి పోటీ హైదరాబాద్‌లో ఘనంగా ముగిసింది.;
ఎన్నో అంచనాలతో, కొంత వివాదాలతో ప్రారంభమైన ప్రపంచ సుందరి పోటీ హైదరాబాద్‌లో ఘనంగా ముగిసింది. అయితే ఈ పోటీ ముగింపు సమయంలో జరిగిన ఒక సంఘటన, మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
లండన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రికలు 'ది సన్' , 'ది గార్డియన్' మిస్ ఇంగ్లాండ్‌కు పోటీలో ఎదురైన అసౌకర్యాలపై ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. హైదరాబాద్‌లో పోటీ నిర్వహణ తీరుపై మిల్లా మాగీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గార్డియన్‌తో ఆమె మాట్లాడుతూ ఇతర పోటీదారులు కూడా ఆమె ధైర్యానికి అభినందనలు తెలిపారని పేర్కొన్నారు.
ఈ వివాదాల మధ్య హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో ప్రపంచ సుందరితో పాటు, ఇతర పోటీదారులు అందరూ హై టీ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు అతిథుల జాబితాను సుందరులు చూసుకున్నారట. మిస్ ఇంగ్లాండ్‌పై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ఫహీమ్ ఖురేషీ , రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆ జాబితాలో లేకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీదారులతో కొంతసేపు ముచ్చటించినట్లు సమాచారం. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.., ముఖ్యమంత్రి పోటీదారులను విదేశాలకు వెళ్లిన తర్వాత హైదరాబాద్ , పోటీ నిర్వహణపై ప్రతికూలంగా మాట్లాడకుండా ఉండాలని మృదువుగా కోరారట.
ఈ సంఘటనల నేపథ్యంలో ప్రపంచ సుందరి పోటీ కేవలం గ్లామర్ ప్రదర్శన వేదిక మాత్రమే కాదని, పోటీదారులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచగల వేదికగా కూడా మారిందని స్పష్టమవుతోంది.