యూఎస్ స్కూల్ ప్రేయర్ వేళ కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఉదంతం తెర మీదకు వచ్చింది. తాజా ఉదంతంలో ముక్కుపచ్చలారని ఇద్దరు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు.;
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఉదంతం తెర మీదకు వచ్చింది. తాజా ఉదంతంలో ముక్కుపచ్చలారని ఇద్దరు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఉదంతం అమెరికాలో షాకింగ్ గా మారింది. మిన్నెసోటా మినియాపొలిస్ లో ఒక క్యాథలిక్ స్కూల్లో ప్రేయర్ జరుగుతుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ కాల్పుల ఉదంతంలో మొత్తం 17 మందికి గాయాలు కాగా.. వారిలో పద్నాలుగు మంది పిల్లలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్కూల్ స్టార్ట్ అయిన మూడు రోజులకే ఈ కాల్పుల ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం. ఆయుధాలు ధరించి స్కూల్ కు వచ్చిన నిందితులు.. విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండగా.. చర్చి కిటికీలో నుంచి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ షాకింగ్ ఉదంతంలో కాల్పులకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు కాల్చేశారు. నిందితుడి వయసు 23 ఏళ్లుగా చెబుతున్నారు.
కాల్పులకు ఉపయోగించిన పిస్టల్ ను చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే.. పోలీసులు కాల్పులు జరుపుతున్న నిందితుడ్ని కాల్చేశారు. అతడ్ని రాబిన్ వెస్ట్ మ్యాన్ గా పిలుచుకుందామని పేర్కొన్నారు. కాల్పుల కోసం మొత్తం మూడు పిస్టళ్లను ఉపయోగించినట్లుగా గుర్తించారు. అతడి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయగా.. ఎలాంటి నేరచరిత్ర లేని వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే.. కాల్పులు ఎందుకు జరిపారన్న అంశాన్ని మాత్రం గుర్తించలేదు. స్కూల్ కాల్పుల ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందిస్తూ.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవటంపై దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.