ఒలింపిక్స్ గేమ్స్ ను పేకాటతో పోలుస్తారా? మంత్రి పార్థసారధి ఫైర్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై విపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారంపై సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఒలింపిక్స్ అప్రూవర్డ్ గేమ్స్ విషయంలో దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Update: 2026-06-04 12:20 GMT

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాపై విపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారంపై సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఒలింపిక్స్ అప్రూవర్డ్ గేమ్స్ విషయంలో దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘మీ బుద్ది ప్రకారం, మీ బుద్దికి తగ్గట్టు మాట్లాడుతున్నారు’’ అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్రం అప్రూవ్ చేసిన గేమ్స్ ను పేకాటతో పోల్చడంపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ కోటా కింద పేకాటలో ప్రతిభ చూపిన వారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చిందంటూ రెండు రోజుల క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలపై మంత్రి కొలుసు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై విచారణ చేయిస్తామని, కమిషన్ వేయిస్తామని వైసీపీ చెబుతోందని మీడియా మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, అధికారంలోకి రాని వారు ఏమైనా చెప్పొచ్చని, అధికారంలోకి వస్తే స్వర్గాన్ని కిందకు దించుతామని కూడా చెప్పొచ్చు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

అబద్దాలు చెప్పి, ప్రజలలో గందరగోళం సృష్టించేలా ప్రయత్నం చేయకూడదని మంత్రి వ్యాఖ్యానించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా నడుచుకోవాలని హితవుపలికారు. డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని అధికారులు వివరణ ఇస్తున్నా, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబుపై ప్రశంసలు

ముఖ్యమంత్రి సహాయనిధిపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజలకు ఉదారంగా సహాయం చేస్తున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలోనే రెండు వేల మందికి మేలు చేశారని, ఇందుకోసం రూ.14 కోట్లు విడుదల చేశారని వివరించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం చేస్తున్నారని వెల్లడించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలోనే వెళ్లిపోయారని మీడియా ప్రశ్నించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి తీసుకునే ప్రైవేటు కార్యక్రమం కోసం పవన్ వెళ్లారని వివరించారు.

Tags:    

Similar News