ఫ్రెండ్లీగా ఫుట్సల్ ఆడుతూ.. ప్రాణాలు పోగొట్టుకున్న ఎంపీ
ఇందులో అందరూ సాధారణ ప్రజలే. ఇక్కడ మాత్రం ఓ లోక్ సభ సభ్యుడు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆయన మరణం మేఘాలయ రాజకీయాల్లో విషాదం నింపింది. ఇంతకూ ఏం జరిగిందంటే?;
ఆయన వయసు 54 మాత్రమే..! ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్నారు..! బహుశా తన ఆరోగ్యానికి కూడా ఢోకా లేకుండా ఉండొచ్చు..! కానీ, విధి బలీయమైనది కదా..? ఊరికే ప్రాణాలు తీసేసింది. మైదానంలో కుప్పకూలిన ఆ లోక్ సభ సభ్యుడు.. ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో జరిగిందీ ఘటన. ఇటీవలి కాలంలో మైదానాల్లో ఆడుతూ ఆడుతూ వ్యక్తులు మరణించిన సంఘటనలు వింటున్నాం.. చూస్తున్నాం. ఇందులో అందరూ సాధారణ ప్రజలే. ఇక్కడ మాత్రం ఓ లోక్ సభ సభ్యుడు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆయన మరణం మేఘాలయ రాజకీయాల్లో విషాదం నింపింది. ఇంతకూ ఏం జరిగిందంటే?
ఆ గళం ఆగిపోయింది...
వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ (వీపీపీ).. మేఘాలయకు చెందిన రాజకీయ పార్టీ. తెలుగులో ఈ పార్టీ పేరును ప్రజల గళంగా చెప్పవచ్చు. ఈ పార్టీ తరఫున మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి గెలిచారు రికీ ఆండ్రూ జె.సింగ్కాన్. స్నేహితులతో కలిసి ఫ్రెండ్లీ ఫుట్సల్ మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి దిగిన సింగ్కాన్... అనూహ్యంగా కుప్పకూలారు. ఇదంతా షిల్లాంగ్ పక్కనున్న మావ్లయ్ మావియోంగ్ ప్రాంతంలో జరిగింది. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాయి.
తొలిసారి గెలిచి..
ఈశాన్య రాష్ట్రం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి తొలిసారి గెలిచారు రికీ ఆండ్రూ. 2024లో జరిగిన ఎన్నికల్లో ఈయన ఘన విజయం సాధించారు. సింగ్కాన్ మరణం పట్ల మేఘాలయ సీఎం క్రనాడ్ సంగ్మా సంతాపం తెలిపారు.
ఫుట్సల్ అంటే..?
ఫుట్ బాల్ గురించి విన్నాం.. బేస్ బాల్ గురించి విన్నా.. మరి ఏమిటీ ఫుట్సల్..? అంటే దీనికి సమాధానం ఫుట్ బాల్ లోని ఒక రకం. ఇది ఫుట్ బాల్ కు ఏమీ భిన్నంగా ఉండదు. దానికి చిన్న వెర్షన్. సాధారణంగా బాస్కెట్ బాల్ కోర్టు వంటి హార్డ్ బేస్ పై ఆడతారు. ఇండోర్ లోనే ఆడతారు. జట్టులో ఐదుగురు ఉంటారు. వీరిలో ఒకరు కీపర్. ఇందులో వాడే బాల్ ఫుట్ బాల్ సైజ్ కంటే చిన్నగా ఉంటుంది. కానీ, బరువుగా ఉంటుంది. కాకపోతే పెద్దగా ఎగరదు. దీంతో కంట్రోల్ చేయడం సులవవుతుంది. 20 నిమిషాల చొప్పున రెండు సెషన్లలో ఆడతారు. ఇంకో రూల్ ఏమంటే.. మ్యాచ్ లో ఆటగాళ్ల మార్పుపై ఎలాంటి నియంత్రణ ఉండదు. ఎంతమందినైనా మార్చుకోవచ్చన్నమాట.