హనీమూన్ మర్డర్ కేసు : వెలుగులోకి సంచలన వీడియోలు
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణ రోజురోజుకీ ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలకమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.;
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణ రోజురోజుకీ ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలకమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రాజా రఘువంశీ, సోనమ్ ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వీరిద్దరి వెంటే ముగ్గురు నిందితులు వెంబడిస్తున్నట్టు మరో వీడియోలో స్పష్టంగా కనిపించడం గమనార్హం. ఈ వీడియోలతో కేసులో కీలకమైన ఆధారాలు బయటపడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
మే 23న ఉదయం 9:45 గంటల సమయంలో మేఘాలయలోని పచ్చని కొండలపై సోనమ్, రఘువంశీ ట్రెక్కింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి తీసిన వీడియోలో వీరిద్దరూ స్పష్టంగా కనిపించారు. ఆ వీడియోలో సోనమ్ ముందుండగా, రాజా ఆమె వెంట వెళ్తున్నాడు. ఈ దృశ్యాల్లో సోనమ్ తెల్లటి టీ-షర్ట్ ధరించి ఉండగా చేతిలో పాలిథిన్ బ్యాగ్ పట్టుకుని ఉంది. అందులో రెయిన్‌కోట్ ఉంచినట్టు తెలుస్తోంది. ఇదే టీ-షర్ట్ మర్డర్ అనంతరం నేరస్థలంలో పోలీసులు కనుగొన్నారు.
అదే రోజు మధ్యాహ్నం సమయంలో సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహా నియమించిన ముగ్గురు హంతకులు రాజాను హత్య చేసి లోయలో పడేశారు. విచారణలో భాగంగా టూరిస్టు గైడ్ దేవ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోను పోలీసులు సేకరించారు. ఇందులో నిందితులు ముగ్గురు దూరంగా ఫాలో అవుతున్నట్టు కనిపించడం విచారణను మరింత మలుపు తిప్పింది.
ఈ వీడియోల నేపథ్యంలో నిందితులు తమ ముఖాలు స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తపడినట్టు మరో వీడియోలో వెల్లడైంది. వీరు టూరిస్టు గైడ్ చేత వీడియో తీస్తున్నట్టు గుర్తించి తమను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, వారి కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.
ఈ తాజా ఆధారాలు కేసు దర్యాప్తుకు కీలకంగా మారినట్టు అధికారులు భావిస్తున్నారు. నిందితుల హత్యాయత్నానికి ముందు క్షణాలు, వారి దృక్పథం, కదలికలు ఈ వీడియోల ద్వారా బహిర్గతమవుతున్నాయి. కేసులో మరిన్ని క్లారిటీ రావచ్చని భావిస్తున్నారు.