మెగా డీఎస్సీపై విపక్షం దుష్ప్రచారం.. సర్కారు సమగ్ర వివరణలో ఎవరికి తెలియని నిజాలు

సిస్టమ్ నిర్వహణలో అత్యంత నిపుణులైన పరిమిత వ్యక్తులకు మాత్రమే అనుమతించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Update: 2026-07-28 10:35 GMT

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ప్రక్రియపై కొద్దికాలంగా విపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. విపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ స్పష్టమైన వివరణ ఇచ్చింది. నియామక ప్రక్రియలో ఏ మాత్రం లోపాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, పకడ్బందీ నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు వెల్లడించింది. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అత్యంత కీలకమైన అంశంపై ప్రభుత్వం సమగ్రమైన వివరణను విడుదల చేసింది.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని, దేశవ్యాప్తంగా ఎంతో విశ్వసనీయత ఉన్న టీసీఎస్ ఐయాన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వం వివరించింది. పేపర్ లీకేజీలు లేదా టెక్నికల్ లోపాలకు ఆస్కారం లేకుండా 256-బిట్ ఎన్‌క్రిప్షన్, అడ్వాన్స్‌డ్ ర్యాండమైజేషన్ వంటి అత్యాధునిక డిజిటల్ భద్రతా వ్యవస్థలను అమలు చేసినట్లు తాఆగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా, అత్యంత గోప్యంగా 42 వేల ప్రశ్నల బ్యాంక్‌ను రూపొందించడం ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీకి పూర్తిగా చెక్ పెట్టడం జరిగిందని వివరించింది.

సిస్టమ్ నిర్వహణలో అత్యంత నిపుణులైన పరిమిత వ్యక్తులకు మాత్రమే అనుమతించినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షా కేంద్రాల నుంచి డిజిటల్ సర్వర్ల వరకు ప్రతి దశలోనూ బహుళ భద్రతాచర్యలతో పటిష్ట నిఘా ఉంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గతంలో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్యారూపంలోకి తెచ్చామని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాగా, తమ ప్రభుత్వం ఒకేసారి వేలాది పోస్టులను భర్తీ చేశామని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి తుది ఎంపిక జాబితా ఖరారై నియామక పత్రాలు అందజేసే వరకు మొత్తం ప్రక్రియను రికార్డు స్థాయిలో కేవలం 148 రోజుల్లోనే పూర్తి చేశామని, మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని విజయవంతంగా పూర్తి చేశామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పక్షపాత రహితంగా నియామకాలు జరగాలనే ఉద్దేశంతో అభ్యర్థుల సందేహాలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా మూడు స్థాయిల్లో గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా వేలాది మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు, ఆన్సర్ కీలు మార్కులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి నిబంధనల ప్రకారమే పరిష్కారాలు చూపినట్లు అధికారులు స్పష్టం చేశారు.

మెరిట్ జాబితాలు, ప్రాథమిక, తుది ఆన్సర్ కీలు, మార్కుల కేటాయింపునకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నిబద్ధతతో చదివి, తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన వేలాది మంది అభ్యర్థుల కృషిని కించపరిచేలా కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. రాజకీయ లబ్ది కోసం లేదా సంచలనాల కోసం ఉద్యోగార్థుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం పూర్తిగా బాధ్యతారాహిత్యమని విమర్శించింది. మెగా డీఎస్సీ ప్రక్రియపై ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, నియామకానికి సంబంధించిన ప్రతి అడుగు, ప్రతి రికార్డు పబ్లిక్ డొమైన్‌లోనూ, ప్రభుత్వ రికార్డుల్లోనూ పక్కాగా ఉందని ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. ప్రతిభావంతులైన యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని దీని ద్వారా స్పష్టం చేసింది.

Tags:    

Similar News