ఆర్డర్ లేట్ అయ్యిందని ఫోన్ లాక్కుని దాడి.. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్!
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కేవలం కొన్ని నిమిషాల ఆలస్యంపై ఓ కస్టమర్ డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. అయితే ఆర్డర్ కొద్దిగా ఆలస్యమైనా కొందరు కస్టమర్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కేవలం కొన్ని నిమిషాల ఆలస్యంపై ఓ కస్టమర్ డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. అంతేకాదు.. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఫోన్‌ను లాక్కొని చెంపదెబ్బలు కొట్టి తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో విషయం మరింత సంచలనంగా మారింది.
ఐదు నిమిషాల ఆలస్యంతో మొదలైన వివాదం
మీరట్‌లోని గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఓ ఆర్డర్‌ను అందించేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం మొదలైంది. అమిత్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరింది. అయితే కస్టమర్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా ఆర్డర్ అందుకున్నానంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీసీటీవీ దృశ్యాల్లో యమన్ డెలివరీ బాయ్ ఫోన్‌ను లాక్కొని అతడిపై దాడి చేస్తున్నట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చెంపదెబ్బలు కొట్టడంతో పాటు తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అమిత్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డెలివరీ బాయ్ సంచలన ఆరోపణలు
ఈ ఘటనపై అమిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డారని.. డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు. అంతేకాదు.. తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని కూడా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. వీడియో ద్వారా అమిత్‌ను గుర్తించిన వారు అతడిని సంప్రదించి.. అనంతరం భవన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
పనులు నిలిపేసిన డెలివరీ ఏజెంట్లు
సహచరుడిపై దాడి జరిగిందన్న వార్తతో డెలివరీ ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ అమిత్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించి నిరసనకు దిగారు. “ఆర్డర్ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెలివరీ ఏజెంట్ల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 34 ఏళ్ల యమన్‌ను అరెస్టు చేసినట్లు భవన్‌పూర్ పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
కేవలం కొన్ని నిమిషాల ఆలస్యంతో మొదలైన చిన్న వివాదం చివరకు దాడి.. పోలీస్ కేసు.. అరెస్టు వరకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో డెలివరీ ఉద్యోగులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై కూడా ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆర్డర్ ఆలస్యమైనప్పుడు కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే అయినప్పటికీ.. ఆ కోపం దాడులకు దారితీయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.