జగన్ కు లేదా స్వాతంత్ర్యం!.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి వైఖరిపై మీడియా సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగుతోందని చెబుతున్నారు.

Update: 2026-08-16 06:15 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి వైఖరిపై మీడియా సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగుతోందని చెబుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుకుంటే, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం కేవలం ఒక్క ట్వీట్ తో సరిపెట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జెండా వందనం చేయాల్సివుండగా, ఆయన ఎక్కడా స్వాతంత్ర్య సంబరాల్లో పాలు పంచుకోలేదని చెబుతున్నారు. విపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొనలేదని, అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జెండా వందనం చేసేవారని అంటున్నారు.

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి జెండా వందనం చేయకపోవడంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గతంలో ఒకసారి ఆయన జెండా వందనం చేసిన సమయంలో జనగణమన గీతాన్ని సరిగా ఆలపించలేదని ఆరోపిస్తూ విస్తృతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయమై వైసీపీ సోషల్ మీడియా నుంచి కూడా ఎటువంటి స్పందన, కౌంటర్లు లేకపోవడమే హాట్ టాపిక్ అవుతోంది.

ఇక జగన్ రెడ్డికి అధికారం తప్ప, దేశంపై బాధ్యత లేదంటూ టీడీపీ అనుకూల మీడియాలో విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడు జెండా వందనం చేయడం ఒక బాధ్యతగా భావించాలని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా, 2011 నుంచి ఒక ప్రధానమైన పార్టీని నడుపుతున్న నాయకుడిగా జగన్ రెడ్డి ఎక్కడో ఒక చోట జెండా వందనం చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సహజంగా ఆగస్టు 15, జనవరి 26 వేడుకల్లో నాయకులు, అధికారులు విధిగా జెండా వందనం చేస్తుంటారు. అధికారంలో ఉంటే వారి బాధ్యతలకు తగ్గట్టు నిర్దేశిత స్థలాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు, ఇతర ప్రైవేటు సంస్థలు ఉన్న చోట ఆయా కార్యాలయాల వద్ద జెండా ఎగుర వేస్తుంటారు. అయితే శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య వేడుకల్లో మాజీ సీఎం జగన్ రెడ్డి ఎక్కడా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చెబుతున్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ మంత్రి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. జగన్ రెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన ఈ కార్యక్రమానికి చేశారని చెబుతున్నారు. అయితే బెంగళూరులో ఉన్న జగన్ రెడ్డి అక్కడైనా జెండా ఆవిష్కరిస్తే బాగుండేది, అనవసర విమర్శలకు తావిచ్చే పరిస్థితి వచ్చేది కాదని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News