బిగ్ డిబేట్ : పవన్ మౌనం...దూరం !
ఏపీలో ఒక పెద్ద చర్చ అయితే సాగుతోంది. అదేంటి అంటే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ తరువాత రెండవ అతి పెద్ద పార్టీ జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వైఖరి మీదనే అని అంటున్నారు.
ఏపీలో ఒక పెద్ద చర్చ అయితే సాగుతోంది. అదేంటి అంటే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ తరువాత రెండవ అతి పెద్ద పార్టీ జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వైఖరి మీదనే అని అంటున్నారు. పవన్ ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి అంతా నిశితంగా గమనిస్తూ బిగ్ డిబేట్ చేస్తున్నారు. పవన్ తన పని తాను చేసుకుని వెళ్తున్నారు. అదే సమయంలో ఆయన కూటమి పెద్దలకు దూరం పాటిస్తున్నారు. అలాగే ఒక్క మాట పల్లెత్తు కూడా అనకుండా మౌనం వహిస్తున్నారు. మరి ఈ మౌనానికి దూరానికి కారణం ఏమిటి అన్నదే ఈ అతి పెద్ద చర్చ అని అంటున్నారు.
కారణాలు ఏమైనా :
తాజాగా చూస్తే పవన్ తీవ్ర జ్వరంతో హైదరాబాద్ కి వెళ్ళడంతో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఆయనకు ఒంట్లో బాగులేదు కాబట్టి వెళ్లడం జరిగింది. దాని కంటే ముందు ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. దాంతో పవన్ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడైనా ఎక్కువ సేపు కార్యక్రమాలు నిర్వహించిన పక్షంలో కొంత అలసటకు గురి అవుతున్నారని అంటున్నారు. తాజాగా జరిగింది కూడా ఇదే అని అంటున్నారు. అయితే పవన్ ఈ విధంగా ఎట్ హోం కి రాకపోవడం హెల్త్ గ్రౌండ్స్ లో అయినా దీని మీద కూడా చర్చ చేసే వారు ఉండడమే విశేషం.
కేబినెట్ కి గైర్ హాజరు :
ఇక ఇంతకు ముందు వరసగా ఆయన కేబినెట్ సమావేశాలకు హాజరు కాలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ నెలలో రెండు సార్లు కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. పవన్ ఇది కూడా అనారోగ్య కారణాల వల్లనే హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నా కూడా సం థింగ్ ఏదో జరిగింది అని చర్చకు పెట్టే వారూ లేకపోలేదు. మరో వైపు చూస్తే ప్రతీ మూడు నెలలకు ఒక మారు నిర్వహించే కలెక్టర్ సదస్సులకు పవన్ మొదట్లో వచ్చినంతగా తరువాత రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇక కేబినెట్ మీటింగ్స్ కి వెళ్ళినా కొన్ని సార్లు మధ్యలోనే ఆయన అనారోగ్య కారణాలతో బయటకు రావడం కూడా జరిగిందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా పవన్ కి ఒంట్లో బాగుండకనే జరిగాయి అని అంటున్నారు. కానీ ఇపుడు అవే పెద్ద ఇష్యూగా మార్చి బిగ్ డిబేట్ ని అయితే నిర్వహిస్తున్న తీరు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
అమరావతికి వెళ్ళకుండా :
ఇల లేటెస్ట్ గా మరో విషయం చూస్తే అమరావతి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. దీనికి కూడా పవన్ హాజరు కాలేదు, అయితే దానికీ కారణం ఉంది. అదే రోజున పవన్ విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇది ముందే షెడ్యూల్ చేయబడిన ప్రోగ్రాం అని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలియచేసాయి. సరే ఇవన్నీ రొటీన్ అనుకున్నా సహజంగానే జరిగాయని అనుకున్నా కోడి గుడ్డు మీద ఈకలు తీయడమే రాజకీయాల్లో అంతా చూసేది చేసేది కాబట్టి పవన్ ఇటీవల మౌనంగా ఉండడంతోనే ఇంత పెద్ద చర్చ సాగుతోంది అని అంటున్నారు.
ఇద్దరూ ఒకే వేదిక మీదకు :
ఇక ఆగస్టు 1న భోగాపురంలో జరిగిన విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మాత్రమే చంద్రబాబు పవన్ బహిరంగంగా ఒకే వేదికను పంచుకున్నారు. అయితే అదే వేదిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఇతర కేంద్ర మంత్రులు ఉన్నారు. దాని కంటే ముందూ తరువాత మాత్రం ఈ ఇద్దరు నేతలు కనిపించడం లేదన్న చర్చ కూడా సాగుతోంది. ఇక వీటన్నిటినీ పక్కన పెడితే ఈ నెల 17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు పవన్ హాజరవుతారా అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న సందేహంగా ఉంది. ఏమిటంటే ఆయన అనారోగ్యం కారణంగా రాలేకపోతారా అన్నదే చర్చగా ఉంది. ఒకవేళ పవన్ హెల్త్ ఇష్యూస్ తో గైర్ హాజరు అయినా అది కూడా మరో బిగ్ డిబేట్ కి కారణం అవుతుంది అనడంతో ఏ మాత్రం సందేహం అయితే లేదు.